వాఘా/అట్టారీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను శుక్రవారం రాత్రి అట్టారీ–వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డాక్యుమెంటేషన్, విధానపర ప్రక్రియ కారణంగా ఆయన అప్పగింత కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. స్వదేశం తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అధికారులకు చెప్పారు. అభినందన్‌ను ఆ వెంటనే ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు. తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక విమానంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి తరలించారు.
ఆర్మీ, నిఘా అధికారుల పర్యవేక్షణలో శనివారం అభినందన్ మానసిక, భౌతిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. అభినందన్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు అభినందన్ స్వదేశం చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ యుద్ధఖైదీయే అని ఆయన్ని అప్పగించిన తరువాత పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్–21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ను ఆయన్ని విడుదలచేసేందుకు అంగీకరించింది. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోయేందుకు ముందడుగు పడినట్లయింది.
ఆలస్యంగా అప్పగింత..
అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించడంతో తమ యుద్ధ హీరో రాక కోసం భారత్ ఎంతో ఉద్వేగంగా ఎదురుచూడసాగింది. శుక్రవారం ఉదయం నుంచే అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ కొన్ని లాంఛనాల వల్ల అభినందన్ అప్పగింత ప్రక్రియ ఆలస్యమైంది. తొలుత సాయంత్రం నాలుగు గంటలకు అప్పగిస్తారని భావించినా, తరువాత సాయంత్రం 6.30 గంటలకు వాయిదా పడింది. చివరకు నలుపు రంగు జాకెట్, ఖాకీ ప్యాంటు ధరించిన అభినందన్ రాత్రి 9.10 గంటలకు పాకిస్తాన్ వైపున్న వాఘా చెక్‌పోస్టును దాటి రెండు దేశాలను వేరుపరుస్తున్న గేటు వైపు నడిచారు.
ఆ సమయంలో ఆయన వెంట పాకిస్తాన్ రేంజర్లు, ఇస్లామాబాద్ హైకమిషనర్‌లో భారత వైమానిక దళ అధికారి ఉన్నారు. అట్టారీ–వాఘా సరిహద్దులో అధికారిక లాంఛనాలు ముగిసిన తరువాత 9.21 గంటలకు పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను బీఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. తరువాత వైమానిక దళ అధికారులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అభినందన్ ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. సాయుధ బలగాలు 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
ఉప్పొంగిన దేశభక్తి..
భారత్ మాతాకీ జై, వందేమాతరం..నినాదాలతో భారత్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం మార్మోగింది. పాకిస్తాన్ నుంచి విడుదలవుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అట్టారీ–వాఘా సరిహద్దులో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు భారీ ఎత్తున గుమిగూడారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, డప్పులు వాయిస్తూ, త్రివర్ణ పతాకాలు ప్రదర్శిస్తూ, మిఠాయిలు పంచుకుంటూ కోలాహలం సృష్టించారు. ఒక్కడి కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. పలువురు తమ ముఖాలపై త్రివర్ణ పతాకాలను పచ్చబొట్టుగా వేసుకున్నారు. అమృత్‌సర్ డిప్యూటీ మేయర్ రమణ్ బక్షి కూడా ప్రజలతో కలసి పాటలు పాడారు. గజమాలతో సమీప ప్రాంతానికి చెందిన ఓ సిక్కు యువకుడు, డోలు వాయిస్తూ ఓ వృద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అధికారులు అనుమతిస్తే తన వద్ద ఉన్న గజమాలతో అభినందన్‌కు స్వాగతం పలుకుతానని ఆ యువకుడు సంబరంతో చెప్పాడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన యోధుడిని నేరాగా చూడబోతున్నందుకు గర్వంగా ఉందని ఢిల్లీకి చెందిన యువ పర్యాటకురాలు నేహ ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్ పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు.
నిరీక్షణ.. నిరీక్షణ..
అట్టారీ–వాఘా సరిహద్దులో వేలాది మంది ప్రజలు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వెయిటింగ్....దేశవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి వెయిటింగ్. అందరూ ఎదురుచూస్తున్నది ఒక్కడి కోసమే. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం వచ్చింది. అంతలోనే చీకటి కూడా పడింది. అమృత్‌సర్ వర్షంలో తడిసి ముద్దయింది. అయినా అదే ఉత్కంఠ, ఉత్సాహం. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రకటించినా.. ఆయన ఎప్పుడు మాతృభూమిపై అడుగుపెడుతాడని రోజంతా దేశం నిరీక్షించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయి అనే తేడా లేకుండా అన్ని టీవీ చానెళ్లలో భారత్, పాకిస్తాన్ సంబంధాలపై ఎడతెగని చర్చ, నిపుణుల వ్యాఖ్యలు, అభినందన్ విడుదలపై సమాచారం కోసం ఎదురుచూపులతో రోజంతా హడావుడిగా గడిచిపోయింది.
దేశభక్తితో దేశం మొత్తం కనెక్ట్ అయిపోయింది. అహ్మదాబాద్‌లో గార్బా నృత్యాలు, బెంగళూరులో జోష్ నృత్యాలు, పూరిలో సైకత శిల్పం, పలు ప్రాంతాల్లో యజ్ఞాలు నిర్వహించారు. రోజూవారీ పనులు చేసుకుంటూనే..అభినందన్ భారత్‌లో అడుగుపెట్టాడన్న సమాచారం కోసం ఓ కన్ను టీవీలు, మొబైల్‌లపై వేశారు. అట్టారీ అవతలి నుంచి ఏ కారొచ్చినా, అందులో అభినందన్ ఉన్నాడా? అన్న ఆసక్తి పెరుగుతూనే ఉంది. లేకపోతే ఆయన్ని నేరుగా ఢిల్లీకే తీసుకెళ్తారా? మీడియాతో మాట్లాడనిస్తారా?..ఇలా అధికారిక సమాచారం కొరవడి, ఊహాగానాలు ఊపందుకున్నాయి. అత్తారీలో పొద్దుపోయే వరకూ వేచి చూసిన ప్రజలు నెమ్మదిగా వెనుదిరగగా, కొందరు పాత్రికేయులు అక్కడే ఉన్నారు. ఏదేమైనా అభినందన్ రాకకోసం సుదీర్ఘ నిరీక్షణ కొనసాగింది.
హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు
వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు సుస్వాగతం. మీ అసమాన ధైర్యసాహసాల పట్ల యావత్ దేశం గర్విస్తోంది. భారత సాయుధ బలగాలు దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వందేమాతరం’
– ప్రధాని నరేంద్ర మోదీ
అభినందన్ వర్ధమాన్ మీ హుందాతనం, స్థిర చిత్తం, ధైర్య సాహసాలు మాలో ప్రతీఒక్కరినీ గర్వపడేలా చేశాయి. సొంతగడ్డకు సుస్వాగతం. మిమ్మల్ని మేమంతా ప్రేమిస్తున్నాం
– కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
ప్రియమైన అభినందన్.. దేశమంతా మీ ధైర్యసాహసం, పరాక్రమంపై గర్వపడుతోంది. మీరు సురక్షితంగా తిరిగిరావడంపై భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే అంకితభావం, ఉత్సాహంతో మీరు ఐఏఎఫ్, భారత్‌కు సేవలందించాలని ఆశిస్తున్నా. – బీజేపీ చీఫ్ అమిత్ షా
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించాను. ఈ సమయంలో అభినందన్‌కు, ఆయన కుటుంబసభ్యులకు దేవుడు మనోస్థైర్యం, శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చదవండి: ‘అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్’
ట్రెండింగ్: వెల్‌కమ్ బ్యాక్ అభినందన్
Comments
Please login to add a commentAdd a comment