వాఘా పోస్ట్: భారత గడ్డపై వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో పాకిస్తాన్ ప్రతినిధి అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించారు. పాక్ చెరనుంచి విముక్తి పొందిన అభినందన్‌కు భారత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఘన స్వాగతం పలికింది. భారత ఐఏఎఫ్ అధికారులు అతన్ని రిసీవ్ చేసుకున్నారు. అతని విడుదల కోసం రెండురోజులుగా యావత్ భారత్ ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. భారతకాలమాన ప్రకారం రాత్రి9.19 నిమిషాలకు కమాండర్ భరత భూమిపై అడుగుపెట్టాడు. దీంతో భారతమతాకి జై అనే నినాదాలతో వాఘా సరిహద్దు దద్దరిల్లింది. అభినందన్ విడుదలపై దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఐసీఆర్‌సీ నిబంధనల ప్రకారం చీకటిపడ్డ తరువాతనే పైలట్‌ను అప్పగించాల్సి ఉన్నందున కొంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అభినందన్ రాకతో అతని కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అభినందన్‌కు వైద్య పరీక్షలు...
భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ ప్రతినిధి భారత్‌కు అప్పగించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అతని రాక తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆనందన్ని వ్యక్తంచేశారు.
భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతపై అయోమయం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం ఆయనను భారత్ దౌత్య అధికారులకు అప్పగించారని, ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టేశారని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈరోజు కచ్చితంగా అభినందన్‌ను అప్పగిస్తారని భారత ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్‌కు ఘనస్వాగతం లభించిందని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు రిపోర్ట్ చేశారు. పోరాట యోధుడు తిరిగి వచ్చాడన్న సమాచారంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగించింది. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్‌లో ఐదుగురు ఐఏఎఫ్ అధికారులు అభినందన్‌ను రిసీవ్ చేసుకున్నారు. కాసేపట్లో ఐఏఎఫ్ అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో అభినందన్‌ను అప్పగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. అభినందన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన రాక కోసం దేశ ప్రజలందరు ఎంతగానో ఎదురు చూశారు. దీంతో వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. జైహింద్, భారత్‌మాతాకి జై, జయహో అభినందన్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా సందడి నెలకొంది. మువ్వెన్నల జెండాతో వేలాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అభినందన్‌పై అప్పగింతపై అయోమయం
అభినందన్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత దౌత్యవేత్తలకు ఆయనను అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అభినందన్‌ను అప్పగించలేదని పాకిస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దౌత్యపరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే అభినందన్‌పై అప్పగింతపై రెండు దేశాలు అధికారిక ప్రకటన చేయకపోవడంతో అయోమయం నెలకొంది.
యోధుడు వచ్చాడు
వీరుడు వచ్చాడు. యోధుడు సొంత గడ్డపై అడుగు పెట్టాడు అంటూ వాఘా పోస్ట్ దగ్గర ఉన్న మీడియా ప్రతినిధులు రిపోర్ట్ చేశారు. 48 గంటలుగా ఎదురు చూస్తున్న మహా వీరుడు తిరిగొచ్చాడు. సగర్వంగా పురిటి గడ్డపై కాలుమోపాడు. శత్రుమూకల ముందు రొమ్ము విరుచుకుని నిలబడి దేశం మీసం మెలేసిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం సాయంత్రం వాఘా సరిహద్దు వద్ద స్వదేశంలో కాలుమోపాడు. అజాత శత్రువుగా శత్రు శిబిరం నుంచి తిరిగొచ్చిన ధైర్యశాలికి దేశం యావత్తు స్వాగతం పలికిందని మీడియా ప్రతినిధులు తెలిపారు.
బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు
వాఘా సరిహద్దులో ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు అయింది. భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. కాగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది.
రాగానే అభినందన్‌కు వైద్య పరీక్షలు
మరోవైపు భారత్ చేరిన వెంటనే అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్ వైద‍్య నిపుణులు వాఘా చేరుకున్నారు. ఏమైనా నిఘా వస్తువులు, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేయనున్నారు. అలాగే అభినందన్ దుస్తులు, వస్తువులను సేకరించి పరీక్షలకు పంపనున్నారు. అలాగే పాకిస్తాన్ ఇచ్చిన వైద్య నివేదికలతో పోల్చి మరో నివేదిక తయారు చేయనున్నారు.
వైద్య పరీక్షలు అనంతరం అభినందన్‌తో ఇంటలిజెన్స్ డీ బ్రీఫింగ్ ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రశ్నించనున్నారు. పాక్‌లో పట్టుబడిన నాటి నుంచి అప్పగింత వరకూ సమాచార సేకరణ చేస్తారు. పాకిస్తాన్ వ్యవహరించిన తీరు, అడిగిన ప్రశ్నలపై సమాచార సేకరణ చేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఐఏఎఫ్...ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనుంది.
అప్పగింత వ్యవహారాలు పూర్తి
పైలట్ అభినందన్‌ను అప్పగించే వ్యవహారాలను భారత రాయబారి గౌరవ్ అహ్లువాలియా పూర్తి చేశారు. అభినందన్‌కు సంబంధించిన పత్రాలను గ్రూప్ కెప్టెన్ జె.టి.క్రెయిన్ పూర్తి చేశారు. కెప్టెన్ జె.టి.క్రెయిన్ దగ్గరుండి అభినందన్‌ను తీసుకు రానున్నారు.
వాఘాకు అభినందన్ తల్లిదండ్రులు
అభినందన్ తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇందుకోసం వారు గత రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి వాఘాకు బయలుదేరిన వారికి విమానంలో తోటి ప్రయాణికుల నుంచి నుంచి వారికి అపూర్వ గౌరవంతో పాటు అభినందనలు వెల్లువెత్తాయి.
తమిళనాడులో ప్రత్యేక పూజలు..
అభినందన్ తిరిగి భారత్‌లో అడుగుపెట్టనున్న సందర్భంగా తమిళనాడు పోలీసులు కాళికంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు సర్వమత ప్రార్థనలు జరిపారు.
మధ్యాహ్నం తర్వాత అభినందన్ విడుదల
- అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని పాక్ పార్లమెంట్‌లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య సమయంలో అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్నారు.
- అభినందన్ విడుదలకు సంబంధించిన పత్రాలను పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్ అక్కడి ప్రభుత్వానికి అందజేసింది.
అభినందన్ విడుదలపై మరో మలుపు
అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనంద డోలికల్లో మునిగిపోయిన వేళ పాకిస్తానీయులు మరోసారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
లాహోర్‌కు అభినందన్
అభినందన్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోంది. రావల్పిండి నుంచి లాహోరుకు అభినందన్‌ను విమానంలో తరలించనున్నారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు అభినందన్‌ను తీసుకురానున్నారు. మధ్యహ్నం రెండు గంటల తరువాత అభినందన్ వాఘా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది.
వాఘా వద్ద భద్రత కట్టుదిట్టం
వాఘా సరిహద్దు వద్ద అధికారులు భద్రను కట్టుదిట్టం చేశారు. అభినందన్‌కు స్వాగతం పలకడానికి స్థానికులతో పాటు, పౌరులు చాలా మంది వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు. స్కూలు చిన్నారులు కూడా అక్కడికి చేరుకుని జాతీయ జెండాలను ప్రదర్శిస్తున్నారు.
మెరుపుదాడులను రాజకీయం చేయడం సరికాదు: అమిత్ షా
ఐఏఎఫ్ జరిపిన మెరుపు దాడులను రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గురువారం బీజేపీ నాయకుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. పాకిస్తాన్‌కు మోదీ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపిందని షా వ్యాఖ్యానించారు.
పాక్ గూఢచారి అరెస్ట్
పాకిస్తాన్ మరో దుర్మార్గం బట్టబయలైంది. ఫిరోజ్‌పూర్‌లో సంచరిస్తున్న పాక్ గూఢచారిని భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్ క్యాంపుల్లో రెక్కీ నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. భారత బలగాలకు సంబంధించిన ఫొటోలు తీస్తున్నాడు. అతని వద్ద నుంచి పాక్ సిమ్ కార్ట్‌తో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ప్రకటన
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. అంతేకాకుండా పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సరైన ఆధారాలు లభిస్తేనే మసూద్‌ను అరెస్ట్ చేస్తామని ఖురేషి స్పష్టం చేశారు.
- పాక్ అధికారులు మధ్యాహ్నం రెండు గంటల తరువాత అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకురానున్నట్టు సమాచారం. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించనున్నారు.
- అభినందన్‌కు స్వాగతం పలకడం కోసం ఆయన తల్లిదండ్రులు గురువారం అర్ధరాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం వారు అమృతసర్‌కు ఫ్లైట్‌లో బయలుదేరారు. విమానంలో తోటి ప్రయాణీకులు నుంచి వారికి అపూర్వ గౌరవంతో పాటు అభినందనలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- భారత వైమానిక దళానికి చెందిన అధికారుల బృందం అభినందన్‌కు స్వాగతం పలకనుంది.
కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎదురుకాల్పులు జరిగాయి. హంద్వారా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
ఒత్తిడికి తలొగ్గిన పాక్..
భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్ తలొగ్గింది. తాము అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది.
అభినందన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్
అభినందన్‌కు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన యూట్యూబ్.. అభినందన్‌కు సంబంధించిన వీడియోలను తొలగించినట్లు, గూగుల్ సర్వీసెస్‌ను అప్‌డేట్ చేశామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment