ఆర్మీ అంటే దేశానికి సేవ చేయడమే కాదు ఏదైనా సమస్య వస్తే స్పందించే గుణం వారి సొంతమని ఆర్మీ మహిళా వైద్యాధికారులు నిరూపించారు. వివరాల్లోకి వెళితే.. 172 మిలిటరీ ఆస్పత్రికి చెందిన ఆర్మీ వైద్యులు కెప్టెన్ లలితా, కెప్టెన్ అమన్‌దీప్ హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా.. ఓ సహ ప్రయాణికురాలు శిశువును ప్రసవించే క్రమంలో ఆమెకు వైద్య సహాయం అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని పాటించారు. దగ్గరుండి ఆమెకు కాన్పు చేశారు. దీంతో సదరు ప్రయాణికురాలు పండంటి పాపకి జన్మనిచ్చింది.
ఆర్మీ అధికారుల చొరవతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు. మహిళా అధికారులు చూపించిన మానవత్వానికి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వం చూపించిన ఆర్మీ అధికారులే నిజమైన హీరోలంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ధైర్యానికి, మానవత్వానికి మహిళా అధికారులు నిదర్శనం.. ఏ సమయంలోనైనా ఆర్మీ తమకు రక్షణ కల్పిస్తుంది.. సైనికుడు ఎప్పుడూ విధుల్లో ఉంటాడంటూ నెటిజన్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment