
బోర్డర్ లో టెన్షన్.. హైఅలర్ట్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కశ్మీర్ లోని ఎయిర్ పోర్టులు, వైమానిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలను మొహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అఖిలపక్ష భేటీకి రావాలని సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్ సహా విపక్ష నాయకులందరికీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాచారం ఇచ్చారు. భారత సైనిక చర్యపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.