పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడంలో వారి పాత్ర
న్యూఢిల్లీ: ‘పాకిస్థాన్ ఈజ్ టెర్రరిస్థాన్, టెర్రరిస్థాన్ ఈజ్ పాకిస్థాన్....వేర్ వాస్ బిన్ లాడెన్ పాకిస్థాన్, పాకిస్థాన్...ఫ్రీ ఫ్రీ బలూచిస్థాన్...హూ ఈజ్ ఏ రోగ్ స్టేట్ పాకిస్థాన్, పాకిస్థాన్’ అనే నినాదాలతో ఐక్యరాజ్య సమితి ప్రాంగణం ఈ నెల 21వ తేదీన మారుమ్రోగిపోయింది. భవనంలోపల కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తున్నప్పుడు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌కు అనుకూలంగా వినిపించిన నినాదాలవి. ‘బలూచిస్థాన్ అమెరికన్ ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీ ఒవర్‌సీస్ ఫ్రెండ్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు వేల మంది పాల్గొన్నారు.
టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచంలో ఏకాకిని చేయడం కోసం బీజేపీ ఒవర్‌సీస్ ఫ్రెండ్స్ చాప్టర్ కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వారు అమెరికాతోపాటు జర్మనీ, స్విడ్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరిపారు. అమెరికాలో కూడా వారు తరచుగా రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యులను కలసుకుంటూ పాక్‌కు వ్యతిరేకంగా తమ వాదనను వినిపిస్తున్నారు. భారత్‌కు అనుకూలమైన కాంగ్రెస్ బృందంతో కూడా వారు చర్చలు జరుపుతున్నారు. పాక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల రెండు సార్లు మాట్లాడడం వెనక తమ కృషి ఉందని వారు చెప్పుకుంటున్నారు. సార్క్ సమావేశాలను అన్ని దేశాలు బహిష్కరించేందకు కూడా ఆయా దేశాల్లో వున్న తమ ఒవర్‌సీస్ శాఖలు కృషి చేస్తున్నాయని వారు తెలిపారు.
అమెరికాలో తొలిసారిగా బీజేపీ ఒవర్‌సీస్ శాఖ 1993లో ఏర్పాటయింది. 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనపై బీజేపీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తలెత్తాయి. ఆ విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో బీజీపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ ఆలోచన మేరకు ఈ ఒవర్‌సీస్ శాఖ ఏర్పడింది. 2001లో భారత పార్లమెంట్‌పై టెర్రరిస్టులు జరిపిన దాడికి నిరసనగా ఈ శాఖ అమెరికా వైట్‌హౌజ్ ముందు ప్రదర్శన జరిపింది. 2004 వరకు క్రియాశీలకంగా వ్యవహరించిన ఈ శాఖ 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు స్తబ్ధుగా ఉండిపోయింది.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ క్రియాశీలకమైంది. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు బీజేపీ ఒవర్‌సిస్ శాఖ విశేషంగా కృషి చేసింది. మోదీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అమెరికాలోని మొత్తం 540 అమెరికా, భారత్ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఆనాడు మోదీకి ఓ రాజకీయ నాయకుడిలాగా కాకుండా ఓ రాక్‌స్టార్‌లా స్వాగతం చెప్పిన విషయం తెల్సిందే. అనంతరం తన శాఖలను 40 దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.