ఇది పాక్‌పై ప్రతీకార దాడులు కావా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యం జరిపిన దాడులను అటు సైన్యంగానీ ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ కశ్మీర్‌లోని ఉడీ సైనికులపై జరిపిన దాడులకు ప్రతీకార దాడులుగా ఎందుకు పేర్కొనడం లేదు? దేశ సరిహద్దులు దాటి కశ్మీర్‌లోకి ప్రవేశించి కశ్మీర్‌తోపాటు పలు భారత మెట్రో నగరాలపై దాడులు జరిపేందుకు టెర్రరిస్టులు సన్నహాలు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం అందడంతోనే, వారి ప్రయత్నాలను ఆదిలోనే వమ్ము చేయడం కోసం మాత్రమే గతరాత్రి టెర్రరిస్టు శిబిరాలపై దాడులు చేశామని సైన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం కూడా అదే పాట పాడుతోంది.
ఉడీ దాడులతో భారత్‌కు కలిగించిన బాధకు రెట్టింపు బాధను పాకిస్థాన్‌కు కల్పిస్థామని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ హెచ్చరించడం, పాకిస్థాన్ ఓ టెర్రరిస్టు దేశమని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించడం, పాక్‌పై ప్రతీకార దాడులకు పాల్పడాల్సిందేనంటూ బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ పిలుపునివ్వడం, ఉడీ దాడుల్లో మరణించిన సైనికులను తాము ఎప్పటికీ మరచి పోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం, ఎప్పుడైనా, ఎక్కడైనా పాకిస్థాన్‌పై దాడి చేసేందుకు తాము సిద్ధమేనని భారత సైన్యం బహిరంగంగానే ప్రకటించడం దేన్నీ సూచిస్తోంది?
సరిహద్దుల గుండా టెర్రరిస్టులు కశ్మీర్‌లోకి రావడం, సరిహద్దుల ఇవతలి నుంచే వారిని తుదముట్టించేందుకు భారత్ సైనికులు కాల్పులు జరపడం ఎప్పుడూ జరిగేదే. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ భూభాగంలో టెర్రరిస్టులు కుట్రలు, కుతంత్రాలు, శిక్షణలు పొందుతున్నారనే విషయం ఈ నాటిది కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. కచ్చితంగా భారత సైన్యం జరిపిన దాడులు ‘ఉడీ’ ప్రతీకార దాడులగా అభివర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే అంతర్జాతీయ సమాజం ముందు ఈ దాడులను సమర్థించుకోవాలంటే ‘డిఫెన్స్ కోసం అఫెన్స్’ చేశామని చెప్పుకోకతప్పదు. అటు సైన్యంగానీ, ఇటు ప్రభుత్వంగానీ ఒకే మాట మీద నిలబడాలి. మయన్మార్ దాడుల విషయంలో లాగా మాట మార్చరాదు. ప్రతీకార దాడులే చేశామని చెప్పుకునేందుకు ఉబలాటపడే మంత్రులు కేంద్ర కేబినెట్‌లో ఎక్కువే ఉన్నారు. మరి వారు ఎంతకాలం సంయమనం పాటిస్తారో చూడాలి
–––ఓ సెక్యులరిస్ట్ కామెంట్