ఆకాశవాణిలో బలూచిస్థాన్ గళం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన దాడులను సమర్థిస్తున్న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలకు మన ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)కి మధ్య ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. బలూచ్ భాషలో అక్కడి వార్తలను, వారి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను రోజుకు గంట చొప్పున ఆకాశవాణి 1974 నుంచే ప్రసారం చేస్తోంది. ప్రపంచం నలుమూలల విస్తరించి ఉన్న బలూచ్ ›ప్రజలను దృష్టిలో పెట్టుకొనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు రోజున మాట్లాడుతూ పాకిస్థాన్ ఆధీనంలోని బలూచి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి ప్రస్తావించారు. కశ్మీర్‌లో పాకిస్థాన్ జోక్యాన్ని నిలువరించడం కోసమే ఆయన బలూచిస్థాన్ ప్రజల కష్టాల గురించి ప్రస్తావించినప్పటికీ మోదీ చొరవతోనే ఆకాశవాణి, బలూచి రేడియో సర్వీస్‌పైన యాప్, మల్టీమీడియా వెబ్‌సైట్‌ను సెప్టెంబర్ 21వ తేదీన ప్రారంభించింది. ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకరావాలని బలూచి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ అది ఇప్పటికి నెరవేరింది.
బలూచి ప్రజల గళాన్ని వినిపిస్తున్న నేటి ఆకాశవాణియే నాడు అక్కడి ప్రజల స్వేచ్ఛను హరించేందుకు పరోక్షంగా కారణమైంది. అప్పటి వరకు స్వతంత్రంగా జీవిస్తున్న బలూచిస్థాన్‌ను పాక్ దురాక్రమణ నుంచి రక్షించుకునేందుకు బలూచిస్థాన్ రాజు అహ్మద్ యార్ ఖాన్ భారత్‌లో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారంటూ ఆకాశవాణి మార్చి 27, 1948లో వార్తను ప్రసారం చేసింది. అంతే ఆ మరుసటి రోజే పాక్ త్రివిద దళాలు బలూచ్‌లోని కలామ్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. అలాంటి ప్రతిపాదనేమీ తమ పరిశీలనలో లేదని, తమను ఎవరూ ఈ విషయంలో సంప్రతించలేదంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే రోజు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పాకిస్థాన్ దురాక్రమణకు గురికాకుండా బలూచిస్థాన్ స్వయం ప్రతిపత్తినైనా రక్షించుకునేందుకు భారత్‌లో విలీనం చేయడానికి అక్కడి రాజు ఖాన్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచి కృషి చేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షులు మౌలానా అబ్దుల్ కలా ఆజాద్‌ను కలుసుకొని చర్చలు కూడా జరిపారు. ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కలుసుకొని విలీన పత్రాలను కూడా అందజేశారు. తర్జనభర్జనలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఖాన్ ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించింది.
నెహ్రూ ఖాన్ సంతకం చేసిన విలీన పత్రాలను వెనక్కి ఇచ్చేశారు. కశ్మీర్ విలీనం కోసమే భారత ప్రభుత్వం బలూచిస్థాన్‌ను వదులుకుందన్న వార్తలు ఉన్నాయి. మొదటి నుంచి బలూచిస్థాన్‌ను ముస్లిం రాజులే పాలిస్తూ వస్తున్నందున అది పాకిస్థాన్‌లో కలవడమే మంచిదని నెహ్రూ భావించి ఉంటారని కూడా అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. బలుచిస్థాన్‌లో కూడా బ్రిటిష్ పాలనే కొనసాగినప్పటికీ వారు వెళ్లేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వెళ్లిపోయారు. అప్పటి నుంచి బలూచిస్థాన్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం నినాదాలు చేస్తూనే ఉన్నారు.