
గుర్మీత్‌కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్‌ల్లోకి ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతోపాటు ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి మరో షాకిచ్చింది. అత్యాచారం కేసులో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే.
దీంతోపాటు ఆయనపై పలు ఇతర ఆరోపణలు రావటంతో జెడ్ కేటగిరీ భద్రతను ఇటీవల రద్దు చేయటంతోపాటు గుర్మీత్‌కు విమానాశ్రయాల్లోని వీఐపీ లాంజ్‌ల్లోకి ఉన్న ప్రవేశానుమతిని కేంద్రం రద్దు చేయడం గమనార్హం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై అన్ని విమానాశ్రయాల అధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా శుక్రవారం ముంబైలో సమావేశమైన ఐఎఫ్‌టీడీఏ మండలి గుర్మీత్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుర్మీత్‌తోపాటు ఆయన వారసురాలిగా పేరున్న హనీప్రీత్ కౌర్ సభ్యత్వం కూడా రద్దు చేసింది. అంతేకాదు, గుర్మీత్‌కు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీఏఏ)లో ఉన్న సభ్యత్వాన్ని కూడా వచ్చే సోమవారం నుంచి నిలుపుదల చేస్తున్నట్లు సంఘం నేత అశోక్ పండిట్ తెలిపారు. గుర్మీత్ రాంరహీం సింగ్ 2015లో ఎంఎస్‌జీ: దిమెస్సెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. వీరిద్దరితో ఇకపై ఎలాంటి సినిమాలు తీయరాదని ఐఎంపీఏఏ, ఐఎఫ్‌టీడీఏ నిర్ణయం తీసుకున్నాయి.