బంధించినా... కాపాడారు
అహ్మదాబాద్: భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి తమను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ తీరప్రాంత భద్రత సంస్థ(పీఎంఎస్‌ఏ) అధికారులను భారత జాలర్లు కాపాడిన సంఘటన ఆదివారం గుజరాత్ తీరంలో చోటుచేసుకుంది. భారత జాలర్లను పాక్ అధికారులు కరాచీకి తీసుకెళ్తున్న సమయంలో పాక్ పడవ ఒకటి భారత పడవను ఢీకొట్టి, మునిగిపోయింది.
ఆ సమయంలో శత్రువులని కూడా చూడకుండా భారత జాలర్లు ఇద్దరు పాక్ అధికారులను రక్షించారు. మరో ముగ్గురు అధికారులు చనిపోయారు. ఇందుకు ప్రతిఫలంగా పీఎంఎస్‌ఏ కూడా ఉదారంగా స్పందించి సోమవారం రాత్రి భారత్‌కు చెందిన ఏడు పడవలు, 60 మంది జాలర్లను విడుదల చేసినట్లు జాతీయ జాలర్ల ఫోరం కార్యదర్శి మనీశ్ లోధారి తెలిపారు. కులభూషణ్ జాదవ్ వ్యవహారంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భారతకు జాలర్లను పట్టుకునేందుకు పాక్ చేసిన యత్నం విషాదాంతమైందని ఓ అధికారి తెలిపారు.