ఇస్లామాబాద్ : పాక్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి... చేపలు పడుతున్న 59 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసినట్లు మీడియా శుక్రవారం వెల్లడించింది. వీరంతా అరేబియన్ సముద్రంలో చేపలు పడుతున్న క్రమంలో వీరందరిని నావిక భద్రత సంస్థకు చెందిన సిబ్బంది గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ మత్స్యకారుల్లో అత్యధిక మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారని ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది.
అయితే పాక్ గత నెల మార్చి 6వ తేదీన ఆ దేశ జైల్లో ఉన్న 87 మంది భారత మత్స్యకారులను విడుదల చేసింది. అలాగే మార్చి 20వ తేదీన మరో 86 మందిని కూడా పాక్ విడుదల చేసింది. వీరందరిని పాక్ ఉన్నతాధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు అప్పగించారు. అలాగే మార్చి 17వ తేదీన దేశ జైళ్లలో మగ్గుతున్న తొమ్మిది మంది పాక్ మత్స్యకారులను భారత్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు జరిగిన కొద్ది రోజులకే పాక్ 59 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేయడం గమనార్హం.