
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ట్విట్టర్‌పై సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హ్యాక్‌కు గురైన ఖాతాలో భారతీయులు ఎవరెవరు ఉన్నారో తెలపాలని కేంద్రం ప్రభుత్వం ప్రశ్నించింది. దీనిపై వీలైనంత త్వరలో తమకు సమాధానం చెప్పాలని శనివారం జారీచేసిన నోటీసులో పేర్కొంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా పలువురు ఖాతాలు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. (ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్.. ఓ ట్విస్ట్!)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. దీనిపై పలు దేశాల అధినేతలు సైతం ట్విటర్ సీఈవోకు లేఖలు రాశారు. (వణికిన ట్విట్టర్)