ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలో ఉద్యోగం సాధించుకుందామనే మహిళా అభ్యర్థులకు రైల్వే శాఖ షాక్‌నిచ్చింది. కొన్ని రకాల ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవద్దని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది నియామకాలు మరియు శిక్షణ శాఖ (డీఓపీటీ)కు లేఖ రాసింది. డ్రైవర్ (లోకో పైలట్), గార్డు, ట్రాక్‌మెన్, పోర్టర్ ఉద్యోగాల్లో కఠినమైన పరిస్థితులు, భద్రతా లోపాలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొంది.
ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కఠినమైన పని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో సదరు ఉద్యోగాల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పింది. మహిళలపై వివక్షతో ఈ నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఎస్‌ఎన్ అగర్వాల్ స్పష్టం చేశారు.
కాగా, భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 2 నుంచి 3 శాతం మహిళా ఉద్యోగులున్నారు. వారిలో ఎక్కువ మంది కార్యాలయాల్లో పనిచేస్తుండటం గమనార్హం. విధి నిర్వహణలో ఇబ్బందులున్నాయని మహిళలకు మొండిచేయి చూపే బదులు.. వారి రక్షణకు రైల్వే శాఖ తగిన చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అధికారులు హితవు పలికారు. మహిళల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగ్ మెన్ సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment