department of personnel and training
-
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కి పంపించింది. -
సిబ్బంది వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ముప్పు నేపథ్యంలో సిబ్బంది వ్యవహరాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, దివ్యాంగులైన అధికారులు, సిబ్బందికి విధులకు హాజరు కావడం నుంచి మినహాయింపు కల్పించింది. ఇతర వ్యాధులతో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు వర్తింపచేసింది. వ్యాధులతో బాధపడేవారికి కరోనా మహమ్మారి ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి : లాక్డౌన్ ఎత్తేయాలి: రాజీవ్ బజాజ్ -
మహిళా అభ్యర్థులకు షాక్..!!
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలో ఉద్యోగం సాధించుకుందామనే మహిళా అభ్యర్థులకు రైల్వే శాఖ షాక్‌నిచ్చింది. కొన్ని రకాల ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవద్దని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది నియామకాలు మరియు శిక్షణ శాఖ (డీఓపీటీ)కు లేఖ రాసింది. డ్రైవర్ (లోకో పైలట్), గార్డు, ట్రాక్‌మెన్, పోర్టర్ ఉద్యోగాల్లో కఠినమైన పరిస్థితులు, భద్రతా లోపాలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కఠినమైన పని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో సదరు ఉద్యోగాల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పింది. మహిళలపై వివక్షతో ఈ నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఎస్ఎన్ అగర్వాల్ స్పష్టం చేశారు. కాగా, భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 2 నుంచి 3 శాతం మహిళా ఉద్యోగులున్నారు. వారిలో ఎక్కువ మంది కార్యాలయాల్లో పనిచేస్తుండటం గమనార్హం. విధి నిర్వహణలో ఇబ్బందులున్నాయని మహిళలకు మొండిచేయి చూపే బదులు.. వారి రక్షణకు రైల్వే శాఖ తగిన చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అధికారులు హితవు పలికారు. మహిళల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగ్ మెన్ సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ చెప్పారు. -
కలెక్టర్ బదిలీపై గందరగోళం
ఇక్కడే కొనసాగేందుకు సిద్ధార్థ్‌జైన్ యత్నాలు అడ్డంకి కానున్న డీవోపీటీ నిబంధనలు చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బదిలీపై గందరగోళం నెలకొంది. బదిలీ తప్పదని కొందరు, ఇక్కడే ఉంటారని మరికొందరు అం టుంటే... మొత్తం మీద ఈ విషయం జిల్లాలో చర్చనీయూంశమైంది. సిద్ధార్థ్‌జైన్‌ను ఇప్పటికే డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడో రేపో జైన్ బదిలీపై వెళ్లనున్నారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే ఉండేందుకు హైదరాబాద్ స్థాయిలో జైన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం సైతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు అజయ్‌జైన్, అజయ్‌సహాని, కర్ణన్, ఏకే సింగాల్, ఐపీఎస్ అధికారి అనూరాధతో పాటు చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను సైతం రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, రోనాల్డ్‌రాస్‌ను అక్కడే కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. అధికారుల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీ సంతకాలతో లేఖ పంపాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాయి. దాంతో సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అడ్డంకిగా మారనున్న నిబంధనలు సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగేందుకు డీఓపీటీ నిబంధనలు అడ్డుగా మారనున్నట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అంతర్రాష్ట్ర బదిలీల్లో మ్యూచువల్‌కు సేమ్ పే బ్యాండ్ (ఇద్దరూ ఒకే జీతం)లో ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ విషయం డీఓపీటీ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలు కోరుతున్న విధంగా మ్యూచువల్‌లో ఉన్న అధికారులు సేమ్ పే బ్యాండ్‌లో లేరు. రోనాల్డ్రాత్ జైన్ కంటే జూనియర్ కాగా, పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్ సీనియర్లు. దీంతో నిబంధనల మేరకు సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుందని ఐఏఎస్ అధికారులు తేల్చి చెబుతున్నారు. నిబంధనలను సడలిస్తేనే జైన్ చిత్తూరులో కొనసాగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. -
ఐఏఎస్ శిక్షణా కాలం తగ్గింపు!
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల శిక్షణా కాలాన్ని తగ్గించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐఏఎస్ ల శిక్షణాకాలాన్ని 103 వారాల నుంచి 75 వారాలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కిరణ్ అగర్వాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసింది. ఐఏఎస్ ప్రొఫెసనల్ కోర్సు(పేజ్ 1, 2)కు 7 వారాలు, అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ కు 4 వారాలు, జిల్లా శిక్షణకు 21 వారాలు ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేయాలంటే 1954 నాటి ఐఏఎస్(ప్రొబెషన్) చట్టానికి సవరణ చేయాల్సివుంటుంది. శిక్షణా కాలాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలపై స్పందనలు, అభిప్రాయాలు నవంబర్ 30లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) శుక్రవారం కోరింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం ఇచ్చింది.