కలెక్టర్ బదిలీపై గందరగోళం
ఇక్కడే కొనసాగేందుకు సిద్ధార్థ్‌జైన్ యత్నాలు
అడ్డంకి కానున్న డీవోపీటీ నిబంధనలు
చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బదిలీపై గందరగోళం నెలకొంది. బదిలీ తప్పదని కొందరు, ఇక్కడే ఉంటారని మరికొందరు అం టుంటే... మొత్తం మీద ఈ విషయం జిల్లాలో చర్చనీయూంశమైంది. సిద్ధార్థ్‌జైన్‌ను ఇప్పటికే డీవోపీటీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడో రేపో జైన్ బదిలీపై వెళ్లనున్నారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఇక్కడే ఉండేందుకు హైదరాబాద్ స్థాయిలో జైన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం సైతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులు అజయ్‌జైన్, అజయ్‌సహాని, కర్ణన్, ఏకే సింగాల్, ఐపీఎస్ అధికారి అనూరాధతో పాటు చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను సైతం రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్, రోనాల్డ్‌రాస్‌ను అక్కడే కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. అధికారుల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీ సంతకాలతో లేఖ పంపాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాయి. దాంతో సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
అడ్డంకిగా మారనున్న నిబంధనలు
సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగేందుకు డీఓపీటీ నిబంధనలు అడ్డుగా మారనున్నట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ అంతర్రాష్ట్ర బదిలీల్లో మ్యూచువల్‌కు సేమ్ పే బ్యాండ్ (ఇద్దరూ ఒకే జీతం)లో ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ విషయం డీఓపీటీ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలు కోరుతున్న విధంగా మ్యూచువల్‌లో ఉన్న అధికారులు సేమ్ పే బ్యాండ్‌లో లేరు. రోనాల్డ్‌రాత్ జైన్ కంటే జూనియర్ కాగా, పూనంమాలకొండయ్య, సోమేష్‌కుమార్, జయేష్‌రంజన్ సీనియర్లు. దీంతో నిబంధనల మేరకు సిద్ధార్థ్‌జైన్ బదిలీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుందని ఐఏఎస్ అధికారులు తేల్చి చెబుతున్నారు. నిబంధనలను సడలిస్తేనే జైన్ చిత్తూరులో కొనసాగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.