woman staff
-
టోల్ ఛార్జీ కట్టమన్నందుకు దాడి, తిరిగి చెప్పుతో..
భోపాల్: టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్‌లో పని చేసే యువతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని తీవ్రంగానే ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కూడా ప్రతిదాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్-భోపాల్ కచ్నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ గుజార్ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్(ఈ-టోల్ పేమెంట్ వ్యవస్థ) లేకుండానే అక్కడికి వచ్చాడు. తాను స్థానికుడినని, టోల్ ఛార్జీల నుంచి తనకు మినహాయింపు ఉందని, ఆ ప్లాజా నిర్వాహకుడికి సైతం తనకు తెలుసని చెప్పాడు. అయితే అతను, ఆ వాహనం లోకల్‌దే అని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవు. పైగా నిర్వాహకుడు సైతం ఆ వ్యక్తి ఎవరో తెలీదని చెప్పాడు. దీంతో.. టోల్ ఛార్జీ కట్టాల్సిందేనని సిబ్బందిగా పని చేస్తున్న అనురాధా దాంగి తేల్చి చెప్పింది. ఆ మాట వినగానే కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆమె వైపు దూసుకొస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అయితే అనురాధా ఊరుకోలేదు. ఆమె సైతం తన చెప్పు తీసి రాజ్‌కుమార్‌ను చెడామడా వాయించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. అక్కడే ఉన్న కొందరు ఆ ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. బూత్‌లో ఏడుగురు మహిళా సిబ్బంది ఉన్నా.. సెక్యూరిటీ గార్డులెవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మహిళా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అయితే.. నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదని సమాచారం. A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX — Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022 -
సఖి కేంద్రంలోనే రాత్రి నిద్ర.. మహిళా సిబ్బందితో అసభ్యంగా..
సాక్షి, సూర్యాపేట: ఆపదలో చిక్కుకున్న మహిళలకు ఆశ్రయమిచ్చి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి జిల్లాలో సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఎన్జీఓల పర్యవేక్షణలో నడుస్తుండటంతో పలు వివాదాలకు నిలయాలుగా మారాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల సఖీ కేంద్రం డైరెక్టర్ వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. సఖి కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నాడని, నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని, మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతాడనే ఆరోపణలు వెంకట్‌రెడ్డిపై ఉన్నాయి. రాత్రివేళ వెంకట్‌రెడ్డి సఖి కేంద్రంలోనే నిద్రిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం రాత్రి సఖి కేంద్రంలో వెంకట్‌రెడ్డి ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రాత్రి 12గంటలకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా వెంకట్‌రెడ్డి అక్కడే ఉండటంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నిబంధనల మేరకు పురుషులు రాత్రి సమయంలో అక్కడ ఉండటం నిశిద్ధం. అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో చనువుగా ఉండటం కోసమే వెంకట్‌రెడ్డి తరచూ అక్కడ బస చేస్తాడని గుసగుసలు వినపడుతున్నాయి. దీనిపై వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. విధుల్లో భాగంగానే రాత్రివేళ సఖి కేంద్రంలో ఉన్నానే తప్ప.. తనకు మరో ఉద్ధేశం లేదని తెలిపాడు. చదవండి: అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి.. -
మహిళా అభ్యర్థులకు షాక్..!!
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలో ఉద్యోగం సాధించుకుందామనే మహిళా అభ్యర్థులకు రైల్వే శాఖ షాక్‌నిచ్చింది. కొన్ని రకాల ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవద్దని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది నియామకాలు మరియు శిక్షణ శాఖ (డీఓపీటీ)కు లేఖ రాసింది. డ్రైవర్ (లోకో పైలట్), గార్డు, ట్రాక్‌మెన్, పోర్టర్ ఉద్యోగాల్లో కఠినమైన పరిస్థితులు, భద్రతా లోపాలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కఠినమైన పని పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో సదరు ఉద్యోగాల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పింది. మహిళలపై వివక్షతో ఈ నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఎస్ఎన్ అగర్వాల్ స్పష్టం చేశారు. కాగా, భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 2 నుంచి 3 శాతం మహిళా ఉద్యోగులున్నారు. వారిలో ఎక్కువ మంది కార్యాలయాల్లో పనిచేస్తుండటం గమనార్హం. విధి నిర్వహణలో ఇబ్బందులున్నాయని మహిళలకు మొండిచేయి చూపే బదులు.. వారి రక్షణకు రైల్వే శాఖ తగిన చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అధికారులు హితవు పలికారు. మహిళల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగ్ మెన్ సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ చెప్పారు. -
మహిళా సిబ్బందికి పోలీసు అశ్లీల ఎస్ఎంఎస్లు
పోలీసు అయి ఉండి.. మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి, మహిళా సిబ్బందికే అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒడిషాలోని ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక సెల్ ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నృసింఘ చరణ్ స్వైన్ తెలిపారు. పని ప్రదేశాలలోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేంద్రపర జిల్లాలో విచారణ జరుగుతున్న మొట్టమొదటి కేసు ఇదే. ఈ చట్టం గత సంవత్సరమే అమలులోకి రాగా, ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. మహిళా సిబ్బంది ఫిర్యాదుతో, ఓ మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక సెల్ విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యి, నివేదిక వెలువడిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నిందితుడు, బాధితురాలు.. ఇద్దరూ కేంద్రపర పోలీసు స్టేషన్లోనే పని చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
మహిళా ఉద్యోగిని వేధించినందుకు మంత్రిపై కేసు
దూరదర్శన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని మానసికంగా వేధించినందుకు బీహార్ రాష్ట్ర మంత్రి శ్యామ్ రాజక్పై పోలీసు కేసు నమోదు చేశారు. పాట్నా దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల మహిళ మంత్రిపై ఫిర్యాదు చేసింది. గత నెల 22న మంత్రి ఫోన్ చేసి తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేగాక రెండు రోజుల క్రితం కొందరు అసాంఘిక వ్యక్తులు తన ఇంటికి వచ్చి మంత్రి పేరు చెప్పి బెదిరించారని ఆమె చెప్పారు. దీంతో పాట్నా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెలుగుచూసిన తర్వాత మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా ఇదంతా రాజకీయ కుట్రని మంత్రి ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు.