న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నివారణ) చట్టం–1989కి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితులెవ్వరినీ తక్షణమే అరెస్టు చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే అరెస్టు చేయాలంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత నియామక విభాగం అనుమతి పొందిన తర్వాతనే అరెస్టులు చేయాలని జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘నిజంగా నేరాలు జరిగిన కేసుల్లో మాత్రమే ముందస్తు బెయిలు మంజూరు చేయకూడదు. నేరం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కానప్పుడు కూడా బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు నిర్దోషులకు రక్షణ లేనట్లే’ అని న్యాయమూర్తులు తమ 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
‘దురుద్దేశంతో కేసు పెట్టారని, నేరం జరగలేదని ప్రాథమికంగా తెలిసినప్పుడు.. అలాంటి కేసుల్లో ముందస్తు బెయిలు ఇవ్వడంపై సంపూర్ణ నిషేధమేదీ లేదు. అమాయకులను వేధించడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే.. దానిని అరికట్టే అధికారం మాకుందని మరోసారి చెబుతున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ ఆదేశాల ద్వారా తాము ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 18ని నిర్వీర్యం చేయడం లేదనీ, నిజంగా నేరాలు జరిగిన కేసుల్లో, కస్టడీలో నిందితులను విచారించాల్సిన కేసుల్లో ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టులు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘పోలీసులు, ఇతరులు దురుద్దేశంతో పౌరులపై వేధింపుల కోసం చట్టాన్ని ఆయుధంగా వాడుకోకూడదు. కానీ ఇలా జరిగినట్లు అనేక సందర్భాల్లో బయటపడింది’ అని కోర్టు పేర్కొంది. ‘ఒక పౌరుడి కులమతాలేవైనా అతణ్ని వేధించడం రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం. ఆ హక్కుకు ఈ కోర్టు రక్షణ కల్పిస్తుంది. చట్టం వల్ల కుల విద్వేషాలు రాకూడదు’ అని న్యాయమూర్తులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment