బ్రహ్మపుత్రపై ‘బోగీబీల్‌’ ప్రారంభం | Indias longest rail cum road bridge in Assam | Sakshi
Sakshi News home page

బ్రహ్మపుత్రపై ‘బోగీబీల్‌’ ప్రారంభం

Published Wed, Dec 26 2018 2:34 AM | Last Updated on Wed, Dec 26 2018 11:07 AM

 Indias longest rail cum road bridge in Assam - Sakshi

బోగీబీల్‌ (అస్సాం): దేశంలోనే అత్యంత పొడవైన రైల్‌–కమ్‌–రోడ్‌ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అస్సాం రాష్ట్రం డిబ్రూగఢ్‌ సమీపంలోని బోగీబీల్‌ వద్ద ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై 4.94 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ వంతెనతో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి. వంతెనను జాతికి అంకితమిచ్చిన అనంతరం మోదీ ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మోదీ తన వాహనం నుంచి దిగి, అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖి, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లతో కలిసి కొంత దూరం వంతెనపై నడిచారు. అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ, రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహైన్‌ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత తన వాహనంలో బ్రిడ్జి అవతలి అంచుకు చేరుకుని, ఈ వంతెన గుండా ప్రయాణించే తొలి రైలు టిన్సుకియా–నహర్లాగున్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించారు. అస్సాంలోని టిన్సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్లాగున్‌ స్టేషన్ల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రైలు ప్రస్తుతం కంటే 10 గంటలు తగ్గిస్తుంది.  బోగీబీల్‌ వంతెన అస్సాంలోనే డిబ్రూగఢ్‌ జిల్లాలో ప్రారంభమై, ధీమాజీ జిల్లాలో ముగుస్తుంది. వంతెన నిర్మాణంతో డిబ్రూగఢ్, ఈటానగర్‌ల మధ్య ప్రయాణ దూరం రోడ్డు మార్గంలో 150 కిలో మీటర్లు, రైల్వే మార్గంలో 705 కిలో మీటర్లు తగ్గనుంది. 

1997 లోనే ఆమోదం.. 
బోగీబీల్‌ వంతెనను అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించారు. ఈ ఒప్పందంలో భాగంగా 1997లోనే ఈ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న నాటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బోగీబీల్‌ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది. 

ఆలస్యపు పనిసంస్కృతిని మార్చేశాం: మోదీ 
బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అభివృద్ధి పనుల ప్రాజెక్టులను ఎప్పుడూ ఆలస్యం చేసే పని సంస్కృతిని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. ‘పాత ప్రభుత్వాలు ప్రాజెక్టులను ఆపేయడంలో పేరుమోశాయి. కానీ మా ప్రభుత్వానికి గుర్తింపు పరివర్తనం, ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణంతోనే వస్తోంది. మేం అధికారంలోకి వచ్చే నాటికి 12 లక్షల కోట్ల విలువైన వందలాది ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడమో, నత్తనడకన సాగుతుండటమో ఉండేది. అదే వేగంతో పనులు జరిగి ఉంటే ఇంకో శతాబ్దం గడిచినా ప్రాజెక్టులు పూర్తయ్యేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది’ అని వివరించారు. 

దేశ భద్రతకూ ఉపయోగం: అస్సాం, అరుణాచల్‌  మధ్య రాకపోకలకే కాకుండా దేశ భద్రతకు కూడా బోగీబీల్‌ వంతెన తోడ్పడనుంది. అరుణాచల్‌లోని చైనా సరిహద్దు వరకు వేగంగా బలగాలను, సైనిక సామగ్రిని తరలించేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఈ బ్రిడ్జి వల్ల తూర్పు ప్రాంతంలో దేశ భద్రత మరింత పెరుగుతుంది. సైనికులు, సామగ్రిని వేగంగా తరలించేందుకు వీలు కలగడమే ఇందుకు కారణం. అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు కూడా అనుకూలంగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది’ అని ఓ అధికారి చెప్పారు. అరుణాచల్‌ సరిహద్దుల్లో సరకు రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ బ్రిడ్జిని ప్రతిపాదించారు. 

మోదీ గతం మరిచారా: దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: బోగీబీల్‌ వంతెనకు 1997లో ప్రధాని హోదాలో తానే శంకుస్థాపన చేశాననీ, ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడం బాధాకరమని మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వాపోయారు. ‘బ్రహ్మపుత్ర నదిపై బోగీబిల్‌ వంతెనను  మోదీ ప్రారంభించారు. కానీ ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్‌ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్‌ పథకాలకూ తన హయాంలోనే నిధులు విడుదల చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ గతం మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.  

యూరోపియన్‌ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లో నిర్మితమైన తొలి వంతెన ఇదే. పూర్తిగా వెల్డింగ్‌ ఉన్న వంతెన కూడా ఇదొక్కటే.  బ్రిడ్జి నిర్మాణానికి 21 ఏళ్లు పట్టింది. ఈ కాలం లో దేశంలో నలుగురు ప్రధానులు మారారు. 120 ఏళ్లపాటు సేవలందించేలా నిర్మించారు. 80 వేల టన్నుల ఉక్కును వాడారు. హెచ్‌సీసీ కంపెనీ ఈ వంతెనను నిర్మించింది. గతంలోనూ బ్రహ్మపుత్రపై రెండు వంతెనలు నిర్మించింది.


►బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 4.94 కి.మీ. డిబ్రూగఢ్, ధెమాజీ జిల్లాలను కలుపుతూ దీన్ని కట్టారు

►1997 జనవరి 22న నాటి ప్రధాని దేవెగౌడ శంకుస్థాపన చేశారు. వాజ్‌పేయి హయాంలో 2002 ఏప్రిల్‌ 21న పనులు ప్రారంభమయ్యాయి 

►వంతెన కిందిభాగంలో రెండు లైన్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. పై భాగంలో మూడు లైన్ల రోడ్డు ఉంది. 

►అత్యంత బరువైన యుద్ధట్యాంకులు సైతం ప్రయాణించేలా, యుద్ధవిమానాలు ల్యాండ్‌ అయ్యేలా దృఢంగా నిర్మించారు.  

► ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,900 కోట్లు. ఈ వంతెన ఆయుష్షు 120 సంవత్సరాలు 

►కొత్త వంతెనతో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకల ప్రయాణకాలం బాగా తగ్గనుంది. 

►సైన్యాన్ని వేగంగా తరలించేందుకు వీలుగా, సరిహద్దు ప్రాంతాలకు సరకురవాణాకు అనువుగా నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement