ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం 13 వేల అడుగుల ఎత్తులో నిర్మితమయ్యింది. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది.
భారత్‌ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం. దీనితో పాటు ఇటానగర్‌లో 20కి పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తేజ్‌పూర్ చేరుకున్న ప్రధానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కజిరంగా నేషనల్ పార్క్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి అనంతరం (ఈరోజు)శనివారం ఉదయం కజిరంగా అభయారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని ఇటానగర్‌కు వెళతారు.
ప్రముఖ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని శనివారం హోలోంగథర్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీనికి 'శౌర్య విగ్రహం' అని పేరు పెట్టారు. జోర్హాట్‌లోని మెలాంగ్ మెటెల్లి పొతార్‌లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అసోంలో రూ. 768 కోట్ల వ్యయంతో డిగ్‌బోయ్ రిఫైనరీ విస్తరణ కోసం గౌహతిలో ఐఓసీఎల్‌కు చెందిన బెత్‌కుచి టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment