పైలట్లు రోడ్డునే రన్వేగా పొరబడి..
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్లు రోడ్డును రన్వేగా భావించి విమానాన్ని ల్యాండ్ చేయబోయారు. చివరి నిమిషంలో పైలట్లకు హెచ్చరికలు రావడంతో ముప్పుతప్పింది. ఫిబ్రవరి 27న జైపూర్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇండిగో విమానం 6ఈ-237 అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు వచ్చింది. విమానాశ్రయంలో సమీపంలో ఓ రోడ్డును రన్వేగా భావించిన పైలట్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. నేలకు అతి సమీపంగా విమానం వచ్చింది. ఈజీపీడబ్ల్యూఎస్ నుంచి హెచ్చరికలు రావడంతో పైలట్లు అప్రమత్తమై విమానం దిశను మళ్లించి, జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ల తప్పిదాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్ల లైసెన్సులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. పైలట్లు ఇద్దరినీ విధుల నుంచి తప్పించినట్టు ఇండిగో అధికారులు చెప్పారు.