ఇందిరకు పెద్ద కోడలంటే ఇష్టం!
ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి
* ఇందిరకు దగ్గర కాలేకపోయిన మేనక
* దివంగత ప్రధానిపై ఆమె వ్యక్తిగత వైద్యుడి పుస్తకం
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. తన చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ మరణించిన తర్వాత చిన్న కోడలు మేనకాగాంధీ రాజకీయాల్లో తనకు సహాయంగా ఉండాలని కోరుకున్నారని.. అయితే ఇందర పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీకి వ్యతిరేక వర్గంలో మేనకాగాంధీ ఉండటంతో ఆమె తన అత్తకు దగ్గర కాలేదని.. ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన కె.పి.మాథుర్ తాజాగా రాసిన పుస్తకంలో వివరించారు.
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మాజీ వైద్యుడైన మాథుర్ 20 ఏళ్ల పాటు ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. 1984 అక్టోబర్‌లో ఆమె హత్యకు గురయ్యే వరకూ ప్రతి రోజూ ఉదయం ఇందిరను కలిసేవారు. ఆయన రాజకీయవేత్తగా ఇందిర ప్రస్థానం, కుటుంబంతో ఆమె సంబంధాలపై ‘ద అన్‌సీన్ ఇందిరాగాంధీ’ పేరుతో పుస్తకం రాశా రు. ఈ పుస్తకానికి ఇందిర మనుమరాలు ప్రియాంకా గాంధీ ముందుమాట రాశా రు. ‘‘ఇందిరకు ఎప్పుడూ తన పెద్ద కోడలు సోనియా అంటేనే ఎక్కువ ఇష్టం.
అయితే.. సంజయ్ మరణించిన కాలంలో ఆమె మేనక వైపు కొంత మొగ్గు చూపారు. కానీ మేనక ఆమెకు దగ్గర కాలేకపోయారు. ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి. అయితే.. రాజకీయ వ్యవహారాలకు వచ్చే సరికి మేనక అభిప్రాయాలను ఇందిర పట్టించుకునేవారు. ఎందుకంటే.. ఆమెకు మంచి రాజకీయ దృక్కోణం ఉంది’’ అని పేర్కొన్నారు.
ఆ సదస్సే కారణం...
‘‘సంజయ్ మరణించిన రెండేళ్ల లోపే.. కఠిన పరిస్థితుల్లో ఆమె (నాటి) ప్రధాని నివాసం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లక్నోలో సంజయ్ విచార్ మంచ్ సదస్సు నిర్వహించ తలపెట్టినపుడు ఇందిర విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఆ సదస్సులో మాట్లాడవద్దని మేనకకు ఇందిర సమాచారం పంపారు. కానీ మేనక ఆ సదస్సులో మాట్లాడారు. ఇది విభేదాలకు దారితీసింది’’ అని చెప్పారు.
ఇందిర, సోనియాలు కలిసిపోయారు
‘‘రాజీవ్, సోనియా వివాహం తర్వాత.. ఇందిర, సోనియాలు చాలా త్వరగా కలసిపోయారు. ఇందిరకు సోనియా చాలా గౌరవం ఇచ్చేవారు. సోనియాపై ఇందిర ఆపేక్ష, మక్కువ చూపేవారు. అతి త్వరలోనే సోనియా ఇంటి బాధ్యతను తీసుకున్నారు’’ అని డాక్టర్ మాథుర్ పేర్కొన్నారు. ‘‘ఇందిర ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకునేవారు. ప్రత్యేకించి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేవారు. శరీరం, మనసుకు సంబంధించి అంశాలు.. ప్రజాదరణ గల సైన్స్ మేగజీన్లు ఇష్టపడేవారు. అంతర్జాతీయ ప్రచురణల్లో క్రాస్‌వర్డ్ పజిల్స్‌ను పరిష్కరించటం ఆమెకు చాలా ఇష్టం. ఒక్కోసారి మధ్యాహ్న భోజనం తర్వాత పేక ఆడేవారు’’ అని వివరించారు.
ఎమర్జెన్సీ ఆమెకు నచ్చకపోయినా...
ఎమర్జెన్సీ పరిస్థితులను వివరిస్తూ ‘‘ప్రధాని (ఇందిర), సంజయ్‌లపై వ్యతిరేకత గంట గంటకూ పెరుగుతూపోతోంది.అప్పటి పరిస్థితులపై ఆమె కూడా అసంతృప్తిగా ఉన్నారు. కానీ.. ఎందుకో ఆమె జోక్యం చేసుకోలేదు. దాన్ని అలాగే కొనసాగనిచ్చారు. చిన్న కుమారుడిపై తన అధిక ప్రేమకు ఆమె బాధితురాలై ఉంటారు’’ అని మాథుర్ చెప్పారు.