విడాకులు కోరుతున్న ఇంద్రాణి | Indrani Mukerjea Seeks Divorce From Peter | Sakshi
Sakshi News home page

విడాకులు కోరుతున్న ఇంద్రాణి

Published Fri, Apr 27 2018 12:15 PM | Last Updated on Fri, Apr 27 2018 12:27 PM

Indrani Mukerjea Seeks Divorce From Peter - Sakshi

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జియా తన పెళ్లి జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. విడాకులు కోరుతూ తన భర్త పీటర్‌ ముఖర్జియాకు నోటీసులు పంపించారు. ఈ కేసులో సహ నిందితుడు పీటర్ నుంచి పరస్పర అంగీకారం ద్వారా విడాకులు కోరుతున్నట్టు లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. ఏప్రిల్‌ 25న ఈ నోటీసులు పంపినట్టు తెలిసింది. తమిద్దరి వివాహ బంధం సయోధ్యగా ఉండేందుకు ఎలాంటి అవకాశం లేదని, విడాకుల అనంతరం ఒకరి జీవితంలోకి మరొకరం ఎలాంటి జోక్యం చేసుకోమని ఇంద్రాణి చెప్పారు. కాగా, పీటర్‌ ముఖర్జియా ఇంద్రాణికి రెండో భర్త.

ఇంద్రాణికి అంతకముందు సంబంధం ద్వారా జన్మించిన కూతురు షీనా బోరా. ఇంద్రాణి, తన ప్రస్తుత భర్త పీటర్‌తో కలిసి అత్యంత పాశవికంగా తన చేతులతోనే గొంతుపిసికి చంపేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. పీటర్‌ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోవడంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి.

దక్షిణ ముంబైలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటర్‌లో ఇంద్రాణి, పీటర్‌ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని ఏళ్లలోనే వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. పీటర్‌ కొడుకు రాహుల్‌తో షీనా బోరా సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత ఆమెను 2012లో చంపేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 2015 ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇంద్రాణి అరెస్ట్‌ తర్వాత పీటర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షీనాను చెల్లిగా తనకు ఇంద్రాణి పరిచయం చేసిటనట్టు పీటర్‌ చెప్పారు. అసలు విషయం తాను గుర్తించలేకపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి, పీటర్‌ అసలు మాట్లాడుకోవడం లేదని తెలిసింది. పీటర్‌ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. ఇంద్రాణి, పీటర్‌ ప్రస్తుతం బ్రిటీష్‌ పౌరసత్వం కలిగి ఉన్నారు. ముంబై, గోవా, ఇంగ్లాండ్‌లో వీరు ఆస్తులు కొన్నట్టు తెలుస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement