
మార్గదర్శకాలు పాటించాల్సిందే
క్రియాశీలంగాలేని పీఎఫ్ ఖాతాలపై కార్యాలయాలకు ఈపీఎఫ్‌ఓ ఆదేశాలు
న్యూఢిల్లీ: క్రియాశీలకంగాలేని ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించడంలో మార్గదర్శక సూత్రాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు జరక్కుండా నివారించేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన క్షేత్రస్థాయి కార్యాలయాలను ఆదేశించింది. వరుసగా 36 నెలలపాటు ఈపీఎఫ్‌ఓకు ఎలాంటి చెల్లింపులు జరపని పీఎఫ్ ఖాతాలను క్రియాశీలకంగా లేని ఖాతాలుగా వర్గీకరించారు. ఇలాంటి ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, అక్రమాలను నివారణకు, క్లెయిమ్‌లు సక్రమమేనని ధ్రువీకరించుకునేందుకు, వాస్తవికమైన క్లెయిమ్‌దారులకే చెల్లింపులు జరిగేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఈపీఎఫ్‌ఓ తన సిబ్బందిని ఆదేశించింది. ఈపీఎఫ్‌ఓ ఈ మేరకు ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. క్రియాశీలకంగాలేని ఖాతాల క్లెయిమ్‌ల పరిష్కారం కావాలంటే నిబంధనల ప్రకారం సంబంధిత యాజమాన్యంనుంచి క్లెయిమ్‌ల ధ్రువీకరణ అవసరమని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. ఒకవేళ, క్లెయిమ్‌దారును గుర్తించే యాజమాన్య సంస్థ అందుబాటులో లేనపుడు, బ్యాంకు అధికారులు గుర్తింపును ధ్రువీకరించాలని, ఇందుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) ఫారం, నివాస ధ్రువీకరణ అవసరమని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ప్రభుత్వం జారీచేసే, పాన్‌కార్డు, ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ఈఎస్‌ఐ గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లెసైన్స్ లేదా ఆధార్ కార్డులను కేవైసీ ఫారంగా ఉపయోగించుకోవచ్చు.
క్లెయిమ్‌దారుకు చెల్లించవలసిన మొత్తం రూ. 50,000కు మించినట్టయితే, అందుకు అసిస్టెంట్ ప్రావిడెంట్ కమిషనర్ ఆమోదం అవసరమని, చెల్లింపు జరపవలసిన మొత్తం రూ. 25,000లకు పైబడి, రూ. 50,000లకు లోబడి ఉంటే, అక్కౌంట్స్ ఆఫీసర్ ఆమోదం సరిపోతుందని, రూ. 25,000ల కంటే తక్కువగా ఉంటే డీలింగ్ అసిస్టెంట్ ఆమోదం అవసరమని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. క్రియాశీలకంగాలేని ఖాతాలకు వడ్డీని జమచేసే ప్రక్రియను 2011 ఏప్రిల్ 1నుంచి ఈపీఎఫ్‌ఓ నిలిపివేసింది. అయితే, ఆ ఖాతాల క్లెయిమ్‌దారులు సదరు ఖాతాలనుంచి విత్‌డ్రాయల్, బదిలీకి దరఖాస్తుచేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 31వ రకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, క్రియాశీలకంగాలేని పీఎఫ్ ఖాతాల్లో రూ. 26,496.61 కోట్లు జమై ఉంది.