
ఇక ఆన్‌లైన్లోనే పీఎఫ్ క్లెయింల పరిష్కారాలు
ఉద్యోగుల ‘భవిష్య నిధి (పీఎఫ్) క్లెయింలను త్వరలో ఆన్‌లైన్లోనే ఖాతాదారులు పరిష్కరించుకునే విధంగా ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటోంది.
న్యూఢిల్లీ: ఉద్యోగుల ‘భవిష్య నిధి (పీఎఫ్) క్లెయింలను త్వరలో ఆన్‌లైన్లోనే ఖాతాదారులు పరిష్కరించుకునే విధంగా ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ మధ్యలో పూర్తిస్థాయిలో కొత్త విధానం అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఇది 5 కోట్ల మంది ఖాతాదారులకు ఉపకరిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు తమ క్లెయింలను పొందేందుకు నిబంధనల ప్రకారం నెల, అంతకు మించి సమయం తీసుకుంటోంది. ఆన్‌లైన్ విధానంలో దీన్ని అధిగమించి దరఖాస్తు చేసుకున్న మూడురోజుల్లోనే పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అయితే దీనికోసం సభ్యులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాలను పీఎఫ్‌తో అనుసంధానించాల్సిన అవసరం ఉంది. కొత్త విధానం అమల్లోకి వస్తే అవినీతి, అక్రమాలకు కూడా కళ్లెం పడనుందని అధికారులు భావిస్తున్నారు.