ముంబై: స్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కల్వరి రంగ ప్రవేశంతో దేశ రక్షణ సన్నద్ధతలో భారీ ముందడుగు పడిందని, ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇన్ ఇండియా’ విజయానికి ఇది చక్కటి ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు. ఈ జలాంతర్గామి నౌకాదళ ప్రవేశం 125 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, దీనిని జాతికి అంకితం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు.
ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్‌ఎస్ కల్వరిని డిజైన్ చేయగా... ముంబైలోని రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) దీన్ని నిర్మించింది. జలాంతర్గామిని నౌకాదళంలో ప్రవేశపెట్టిన అనంతరం లోపలికి వెళ్లిన మోదీ అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే 1967 నాటి మొదటి కల్వరి జలాంతర్గామిలో సేవలందించిన మాజీ ఉద్యోగులతో ఆయన ముచ్చటించారు. అనంతరం ముంబైలోని నౌకా దళ డాక్‌యార్డ్‌లో మోదీ ప్రసంగిస్తూ.. గత మూడేళ్లుగా దేశ రక్షణ రంగంలో మార్పులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ‘కల్వరి చేరికతో దేశ నౌకాదళ సన్నద్ధతలో కీలక అడుగు పడింది. కల్వరి శక్తి మన నౌకాదళాన్ని బలోపేతం చేస్తుంది. ఇతర దేశాలు భారత్ ప్రయాణిస్తున్న శాంతి, సుస్థిర మార్గంలో కలిసి సాగాలని కోరుకుంటున్నాయి. భారతదేశం బలోపేతం కావడం మొత్తం మానవాళికి ఎంతో కీలకం’ అని ప్రధాని చెప్పారు.
హిందూ మహాసముద్రం కీలకం: సరిహద్దు దేశాలైన శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌ల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా భారతదేశమే మొదటిగా స్పందిస్తుందని మోదీ వెల్లడించారు. ‘ నౌకల్లో దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ వేట వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇతర దేశాలతో సంబంధాల బలోపేతానికి హిందూ మహాసముద్రం ఎంతో సహాయకారిగా ప్రధాని మోదీ తెలిపారు. ‘మా ప్రభుత్వ పథకాల్లో, విధాన నిర్ణయాల్లో హిందూ మహాసముద్రానికి కీలక స్థానం ఉంది.
ఈ సముద్రాన్ని నేను సాగర్ ( .అ.ఎ.అ.ఖ– సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) అని పిలుస్తాను.. అంటే ఈ ప్రాంతంలోని అందరి భద్రత, వృద్ధికి సహాయకారి అని అర్థం. ఈ శతాబ్ది అభివృద్ధి పథంలో హిందూ మహాసముద్రం పాత్ర ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వ విధానాల్లో ప్రత్యేక స్థానం కల్పించాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
టైగర్ షార్క్ పేరే..
హిందూ మహాసముద్రం లోని భయంకర ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. దీనిని ఫ్రెంచ్ నౌకా రక్షణ, ఎనర్జీ కంపెనీ డీసీఎన్‌ఎస్ డిజైన్ చేయగా... రక్షణ శాఖకు చెందిన ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. మొత్తం ఆరు స్కార్పిన్ సబ్‌మెరైన్లు నిర్మిస్తుండగా అందులో మొదటిది కల్వరి.
కల్వరి ప్రత్యేకతలివీ..
♦ శత్రువుకు జలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత.
♦ కచ్చితత్వంతో దూసుకెళ్లే ఆయుధాలతో శత్రువును దెబ్బకొడుతుంది. టార్పెడోలతో పాటు ట్యూబుల ద్వారా యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు.
♦ రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి.
♦ పొడవు: 67.5 మీ (221 అడుగులు)
♦ వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ.
♦ సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ.
♦ పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ.
♦ 18 టార్పెడోలను మోసుకెళ్లగలదు
♦ 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు
Comments
Please login to add a commentAdd a comment