న్యూఢిల్లీ : సిరియాలో బలహీనపడిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) భారత్, శ్రీలంకపై దృష్టి సారించిందని ఇంటలెజిన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇరాక్, సిరియాల్లో తమ ప్రాబల్యం తగ్గిన కారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే సిరియాలో ఉన్న జీహాదీలను స్వదేశాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపాయి. ఈ క్రమంలో శ్రీలంక, భారత్‌లే ఐఎస్ ప్రధాన టార్గెట్‌లుగా మారాయి..కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత్‌లోని కేరళ, తమిళనాడు, కశ్మీర్‌లో వారు పాగా వేసే అవకాశం ఉందని కేరళ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తమకు సంబంధించిన సమాచారం లీకవుతుందని పసిగట్టిన ఉగ్రమూక ప్రస్తుతం.. చాట్‌సెక్యూర్, సిగ్నల్ అండ్ సైలెంట్ టెక్ట్స్ తదితర యాప్‌లు వాడుతూ అప్రమత్తమైందని వెల్లడించాయి. ఈ మేరకు ఎన్డీటీవీ కథనం ప్రచురించింది. కాగా ఈ విషయం గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. కేరళ నుంచి గత కొన్నేళ్లుగా వందలాది మంది ఐఎస్‌లో చేరారని తెలిపారు. వీరిలో 3 వేల మందిని డీరాడికలైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో వారిని కూడా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment