2 వేల నోటుపై సరి కొత్త సీక్రెట్!
2 వేల నోటుపై సరి కొత్త సీక్రెట్!
Published Tue, Dec 13 2016 11:07 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా విడుదలైన రెండు వేల రూపాయల నోటు గురించి బయటికొచ్చిన విషయాలు అన్నీ ఇన్నీ కావు. అందులో జీపీఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, అందువల్ల పెద్దమొత్తంలో నోట్లు ఎవరిదగ్గరైనా ఉంటే తెలిసిపోతుందని అనేవారు. అదంతా ఉత్త ట్రాష్ అని తేలిపోయింది. ఇప్పుడు ఈ నోటు గురించి మరో కొత్త విషయం బయటకు వచ్చింది. అందులో పి32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న విషయం ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది. 2వేల రూపాయల నోటు ముద్రించడానికి రేడియోధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వదంతులు తెగ వ్యాపిస్తున్నాయి. ఢిల్లీ, చెన్నై, వెల్లూరు, బెంబగళూరు, పుణె లాంటి నగరాల్లో సరిగ్గా ఎక్కడైతే పెద్దమొత్తంలో నోట్లు దాచిపెట్టారో అక్కడే ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి, వాటిని పట్టుకోవడంతో ఆ తర్వాతి నుంచి ఈ రేడియో ధార్మిక ఇంకుకు సంబంధించిన కథనాలు మరీ ఎక్కువయ్యాయి. ఒకేచోట ఎక్కువ మొత్తంలో ఈ పి32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని, అందుకే పెద్దమొత్తంలో నోట్లు ఉన్నచోటల్లా దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. నోటులో ఉన్న ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు.
వాస్తవం ఏంటి?
అసలు ఈ నోటు తయారీ విషయంలో రెగ్యులర్‌గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్‌ను చేర్చలేదని రిజర్వు బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే నోటు ముద్రణకు రేడియోధార్మిక ఇంక్ వాడారన్నది కూడా ఉత్త వదంతి మాత్రమేనని తెలిపాయి. దాంతో.. ఈ నోటు గురించిన మరో విశేషం కూడా తప్పేనని తేలిపోయింది.
Advertisement
Advertisement