![రెండువేల నోటు ఇల్లీగల్! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71479710897_625x300.jpg.webp?itok=dEoc52tK)
రెండువేల నోటు ఇల్లీగల్!
- దేశంలో ఆర్థిక అరాచకం
- పార్లమెంటు ఎదుట కాంగ్రెస్ నిరసన
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా కొత్త రెండువేల నోటుపైనా తీవ్ర ఆరోపణలు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రధాని మోదీ రూ. రెండువేల నోటును జారీచేశారని ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలిందని మండిపడింది. ఈ విషయంలో పార్లమెంటు లోపల, బయటా కేంద్రాన్ని ఎండగడతామని పేర్కొంది.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. రెండువేల నోటు జారీచేయడం చట్ట వ్యతిరేక చర్య. ఆర్బీఐ చట్టం ప్రకారం కొత్త కరెన్సీ ముద్రణ కోసం నోటీఫికేషన్ జారీచేయాలి. ఆ తర్వాత కొత్త నోటు విడుదల చేయాలి. కానీ చట్టప్రకారం తప్పనిసరి అయిన ఈ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో గళమెత్తడమే కాకుండా ఇటు ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.