తమిళనాట రజినీ పార్టీ సునామీ!
- తనకు పవర్ అంటే ఇష్టం అన్న రజినీ
- సొంత పార్టీని పెడతారని ఊహాగానాల జోరు
చెన్నై: తమిళనాట కొత్త పార్టీ అవతరిస్తోందా.. రాజకీయాలకు దూరంగా ఉంటూ, రాజకీయాలంటే నచ్చవంటూ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నట్లు కనిపించే ప్రముఖ నటుడు సూపర్ స్టార్ ఆ కొత్త పార్టీకి ఊపిరి పోస్తున్నారా అంటే అవునంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ విషయం హల్ చల్ చేస్తోంది. తనకు 'పవర్' అంటే ఇష్టమేనని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే తాజాగా కొత్త పార్టీ చర్చకు అసలు కారణమైనట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించి కీలకంగా వ్యవహరించాలని చూస్తున్న బీజేపీ మద్దతుతో రజనీ కొత్త పార్టీ పెడతారని, దాని ద్వారా దక్షిణాధి అంతటా తనకు బాటలు వేసుకోవచ్చని బీజేపీ కూడా యోచిస్తోందని ఊహాగానాలు బయలుదేరాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్న రజనీ కాంత్.. జయలలిత మరణం అనంతరం తాజాగా తమిళనాడులో ఏర్పడుతోన్న రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు తమిళనాట వీధుల్లో చెక్కర్లు కొడుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ జనరల్ శశికళను లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకునేందుకు ఒకరోజుముందే తనకు పవర్ అంటే ఇష్టం అని రజనీకాంత్ చెప్పారు.
ఆయన అలా చెప్పిన మరుసటి రోజే తమిళనాట రాజకీయాల్లో విపరీతంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 1996 ఎన్నికల సమయంలో రజనీకాంత్ ఒక ఫేమస్ స్టేట్ మెంట్ ఇచ్చారు. 'జయలలితకు ఓటెస్తే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు' అని ఆ దెబ్బకు జయలలిత ఓడిపోయింది. అయితే, ఆ తర్వాత ఆయన రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేదు కదా.. పట్టించుకోలేదు కూడా. అయితే, ఎప్పటి నుంచో తమిళనాడులో పాతుకుపోవాలని బీజేపీ చూస్తోంది. దీనికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రస్తుతం జయలలిత చనిపోవడంతో బీజేపీ ఆశకు మరింత బలం చేకూరుంది. ఇప్పటికే బీజేపీ వర్గాలు రజినీకాంత్‌తో చర్చలు చేశారని, అవి అనుకున్నదానికంటే మంచి ఫలితాలు ఇచ్చాయని, నేరుగా బీజేపీ అని కాకుండా ఆయన ఒక పార్టీని పెట్టడం ద్వారా తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని పలువురు చెప్పుకుంటున్నారు. అయితే, ఇవేం వాస్తవాలు కావన్నట్లుగా రజినీకాంత్ మాటల ప్రకారం తెలుస్తోంది.
పవర్ అంటే పొలిటికల్ పవర్ కాదంట..
తనకు పవర్ అంటే ఇష్టమన్నానని, అయితే, పొలిటికల్ పవర్ కాదని, ఆధ్యాత్మిక శక్తి అని రజినీ చెప్పారు. 'డబ్బు, ఖ్యాతి ఒకపక్కకు పెట్టి నన్ను ఏం కావాలని అడిగితే నేను ఆధ్యాత్మికాన్ని కోరుకుంటాను. ఎందుకంటే అది చాలా శక్తిమంతమైనది. శక్తిని ఇష్టపడేవాళ్లలో నేను ఒకడిని. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు' అని రజినీ చెప్పారు.