నితీష్ పదవికి ముప్పుందా?
నితీష్ పదవికి ముప్పుందా?
Published Wed, Aug 2 2017 3:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ఢిల్లీ: ఆర్జేడీతో తెగతెంపులు చేసుకొని బీజేపీతో పొత్తు కుదుర్చుకుని మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ పదవికి ముప్పుందా? ప్రజాతీర్పును కాదని, అప్రజాస్వామికంగా బీజేపీతో పొత్తుపెట్టుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేడీయూ నేత శరద్ యాదవ్‌కు పార్టీ నుంచి నితీష్‌ను బహిష్కరించేంత శక్తి ఉందా? ఈ ప్రశ్నలకు రాబోయే కాలమే సమాధానం చెప్పాలి.
‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ పేరిట ఆగస్టు 27వ తేదీన ఆర్జేడీ నిర్వహిస్తున్న ర్యాలీకి జేడీయూ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన శరద్ యాదవ్ వెళుతున్నారు. ఈ ర్యాలీకి హాజరవడానికి ముందు, అంటే ఆగస్టు ఐదవ తేదీ నుంచి నాలుగైదు రోజులపాటు శరద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలో విస్త్రతంగా పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారని, నితీష్ కుమార్ పార్టీకి చేసిన ద్రోహం గురించి చర్చిస్తారని జేడీయూ ప్రధాన కార్యదర్శి అరుణ్ శ్రీవాత్సవ బుధవారం మీడియాకు తెలిపారు. ఆర్జేడీ–జేడీయూ–కాంగ్రెస్ కూటమికి రాష్ట్ర ప్రజలు ఓటేశారని, ఇలా మధ్యలో కూటమికి ద్రోహం చేయడం పట్ల ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో కూడా ఈ సందర్భంగా శరద్ యాదవ్ తెలుసుకుంటారని ఆయన చెప్పారు.
నితీష్ వ్యవహారాన్ని తప్పుపడుతూ ఇప్పటికీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, నాగాలాండ్ రాష్ట్ర పార్టీ శాఖల నుంచి శరద్ యాదవ్‌కు లేఖలు వచ్చాయని ఆయన తెలిపారు. మరి కొన్ని రాష్ట్ర శాఖల నుంచి కూడా ఇలాంటి లేఖలు వచ్చే అవకాశం ఉందని శ్రీవాత్సవ్ చెప్పారు.
Advertisement