అమిత్ షాకు సీబీఐ క్లీన్‌చిట్
ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్ కేసులో ఊరట
అహ్మదాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షాకు ఊరట. 2004లో సంచలనం సృష్టించిన ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్ కేసులో షాకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ‘‘ఆ ఉదంతంలో షా పాత్రను నిరూపించేందుకు తగినన్ని సాక్ష్యాధారాల్లేవు. అందుకే ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన పేరు చేర్చలేదు’’ అని సీబీఐ ఇన్‌స్పెక్టర్ విశ్వాస్‌కుమార్ మీనా బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ కేసులో షాతో పాటు అప్పటి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ కౌశిక్‌లపై నేరాభియోగాలు మోపాలంటూ ఆ ఎన్‌కౌంటర్‌లో ఇషత్‌త్రో పాటు మరణించిన జావెద్ షేక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై తండ్రి గోపీనాథ్ పిళ్లై పెట్టుకున్న అర్జీని కూడా కొట్టేయాల్సిందిగా కోరారు. 2004 జూన్ 15న జరిగిన ముంబైకి చెందిన కాలేజీ విద్యార్థిని ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆమెతో పాటు ప్రాణేశ్ పిళ్లై, అమ్జదలీ అక్బరలీ రాణా, జీషన్ జోహర్‌లను కూడా గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. వారంతా లష్కరే తోయిబా ఉగ్రవాదులని, మోడీని చంపేందుకు కుట్ర పన్నారని వాదించారు. కానీ అది నిజం కాదని, వారిది బూటకపు ఎన్‌కౌంటరని 2013లో సీబీఐ తేల్చడమే గాక ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.