ప్రపంచశక్తిగా భారత్‌ ! | Israeli Prime Minister Benjamin Netanyahu describes Mahatma Gandhi as 'humanity's great prophet' | Sakshi
Sakshi News home page

ప్రపంచశక్తిగా భారత్‌ !

Published Thu, Jan 18 2018 2:19 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

Israeli Prime Minister Benjamin Netanyahu describes Mahatma Gandhi as 'humanity's great prophet'  - Sakshi

అహ్మదాబాద్‌: భారత్‌ను ప్రపంచశక్తిగా తీర్చిదిద్దేందుకు సృజనాత్మకత ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్పు తీసుకొస్తున్నారని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసించారు. దూరదృష్టితో మోదీ భారత్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని కొనియాడారు. అటు ప్రధాని మోదీ కూడా ఇజ్రాయెల్‌ సృజనాత్మకతను ప్రశంసించారు. నవభారత నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహించే వ్యవస్థను నెలకొల్పేందుకు కృషిచేస్తోందన్నారు. నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్‌ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఏర్పాటుచేసిన ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ టెక్నాలజీ’ (ఐ క్రియేట్‌)ను మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ, నెతన్యాహు దంపతులు పతంగులు ఎగురవేశారు. భారత పర్యటన స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని నెతన్యాహు అన్నారు.

మేమిద్దరం యువకులమే!
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ఐ క్రియేట్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన యువ వ్యాపారవేత్తలు, వాణిజ్య ప్రముఖులనుద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించారు. ప్రతి రంగంలో భారత్‌తో భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ యువత భారత్‌లో పర్యటించి ఐ క్రియేట్‌ ద్వారా శక్తిసామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంతో భారత్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్పు ద్వారా ప్రపంచశక్తిగా భారత్‌ మారేందుకు ఆయన పనిచేస్తున్నారు. నైపుణ్యత, సృజనాత్మకత ద్వారా దీన్ని సాధిస్తున్నారు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.  ‘నేను, మోదీ ఇద్దరు యువకులమే. ఆశావాద ధృక్పథంతో ముదుకెళ్తున్నాం. మా ఆలోచనలు నిత్య యవ్వనం’ అని పేర్కొన్నారు.

నవభారత నిర్మాణానికి...
సృజనాత్మక వ్యవస్థ ద్వారా నవభారత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నిధులు, స్థలాలు, మార్గదర్శకులను ఇవ్వటంతోపాటు ఇతర వసతులు కల్పించి వారిలోని సామర్థ్యానికి పదును పెట్టేందుకే ‘ఐ క్రియేట్‌’ను ఏర్పాటుచేశామన్నారు. అనంతరం, సబర్‌కంఠ జిల్లాలోని వాద్రాద్‌ గ్రామంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ వెజిటబుల్స్‌’ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. భారత్‌ ఓ స్వప్నంతో ముందుకెళ్తున్న దేశమని నెతన్యాహు ప్రశంసించారు. ఇజ్రాయెల్‌ సాంకేతికతతో గుజరాత్‌ రైతులు సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా నెతన్యాహు ప్రశంసించారు.

అట్టహాసంగా రోడ్‌ షో
మోదీ, నెతన్యాహుల రోడ్‌ షో అహ్మదాబాద్‌ వీధుల్లో ఘనంగా సాగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 8 కి.మీ. మేర పటిష్ట భద్రత నడుమ ఈ రోడ్‌ షో జరిగింది. రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు భారత్, ఇజ్రాయెల్‌ పతకాలు చేతిలో పట్టుకుని బారులు తీరారు.

మోదీకి కానుక
భారత పర్యటన సందర్భంగా మోదీకి నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్‌–మొబైల్‌ వాటర్‌ డీసాలినేషన్‌ అండ్‌ ప్యూరిఫికేషన్‌ జీప్‌’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్‌ జిల్లా బావ్లా సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్‌ (భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. ‘గతేడాది ఇజ్రాయెల్‌ పర్యటనలో నాకు ఈ వాహనాన్ని చూపించారు. చెత్త నీటిని కూడా ఇది శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ వాహనాన్ని నెతన్యాహు కానుకగా ఇచ్చా రు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుంది. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement