ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు | IT Department Searches Unaccounted Income More Than 2000 Crore Detected | Sakshi
Sakshi News home page

2 వేల కోట్ల నల్లధనం : టీడీపీ నేతల్లో గుబులు

Published Thu, Feb 13 2020 8:17 PM | Last Updated on Thu, Feb 13 2020 9:28 PM

IT Department Searches Unaccounted Income More Than 2000 Crore Detected - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించిన వివరాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల్లో అత్యంత కీలకమైన విషయమేమంటే... ఒక ప్రముఖ వ్యక్తి వద్ద పీఎస్‌ గా పనిచేసిన వ్యక్తి నుంచి కీలకమైన పత్రాలు అనేక ఆధారాలు లభ్యమైనట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల అనేక చోట్ల పలువురు వ్యక్తులు ఇన్ ఫ్రా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

గడిచిన ఆరు రోజులుగా జరుపుతున్న సోదాల్లో భాగంగా  బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమార్కులు భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ... ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది. (చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు)

ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా రూ. 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది. ఐటీ దాడుల్లో భాగంగా.. లెక్కల్లో చూపని రూ. 85 లక్షల నగదు,  రూ. 71 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది. కాగా గత ఆరు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావుకు చెందిన నివాసాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement