
'ఇక అంతా దేవుడి చేతుల్లోనే'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరుణంలో విజయంపై ప్రధాన పార్టీల నాయకులు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. వారికి లోపల మాత్రం కాస్త సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ గెలుపుపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. 'ఇక ఎన్నికలు ముగిశాయి. మా ప్రయత్నం నిజాయితీగా నిర్వర్తించాం. మా ప్రయత్నంలో ఎటువంటి స్వార్ధం లేదు. ఇక మా విజయం దేవుడి చేతుల్లోనే ఉంది'అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్నాయి. సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్దగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు కేజ్రీవాల్ ఆశగా ఎదురు చూస్తున్నారు.