'వేటాడటానికి నేరస్తుడిని కాదు'
న్యూఢిల్లీ: పారిపోయాడంటూ తనపై వస్తున్న విమర్శలపై ఎంపీ, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. సండే గార్డియన్ కు ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. తాను ఎక్కడ ఉన్నానో చెప్పడం తెలివైన పని అనిపించుకోదన్నారు. వేటాడడానికి తానేమీ కరడుగట్టిన నేరస్తుడిని కాదని, తనపై ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయని వివరించారు.
తాను పారిపోయాడని మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా తప్పు అని చెప్పారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేక మార్చి 2న భారత్ నుంచి వెళ్లిపోయారా అనే ప్రశ్నకు... తాను ఓ మిత్రుడితో కలిసి విదేశాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. తాను 7 పెద్ద బ్యాగులతో వెళ్లిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇద్దరు వ్యక్తులతో ఎంత మేరకు లగేజీ అవసరమే, అంతే తీసుకెళ్లానని చెప్పారు.
భారత్ కు ఇప్పట్లో మాత్రం వెళ్లను!
ఇప్పటికే తనను క్రిమినల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ప్రస్తుతం తనకు భారత్ లో అంతగా పనిలేదని, ఇలాంటి పరిస్థితులలో భారత్ కు వెళ్లడం మంచిది కాదని భావిస్తున్నట్లు మాల్యా చెప్పుకొచ్చారు. ఎదో ఒకరోజు కచ్చితంగా తిరిగివస్తానన్న ఆశిస్తున్నట్లు తెలిపారు. కొందరు కక్ష్యగట్టుకుని ఉద్దేశపూర్వకంగా తనపై వేలుపెట్టి చూపిస్తున్నారని చెప్పారు.
నేరస్తుడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు?
రుణాలు చెల్లింపుల వ్యవహారాన్ని వ్యాపారినికే పరిమితం చేయాలి కానీ, అంతమాత్రానా నేరస్తుడిగా ముద్రవేయడం ఏంటని ప్రశ్నించారు. తన వ్యాపారాలు నష్టాన్ని చవిచూడటంతో ఒక్కసారిగా బ్యాంకులు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ కారణం చేత విలన్ గా చిత్రీకరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వ్యాపారంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నారు.