బీటెక్ విద్యార్థులపై వీసీ సెక్యూరిటీ కాల్పులు
జైపూర్: జైపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సందీప్ భక్షి ఫాం హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి కొందరు ప్రైవేటు బీటెక్ కాలేజీ విద్యార్థులు వీసీ రెసిడెన్సీ ముందు సెల్ఫీలు దిగుతుండగా.. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నాడు. వెళ్లిపోవాలని ఎంత వారించినా వినకపోవడంతో విద్యార్థులపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీసీ నివాసానికి చేరుకుని కాల్పులకు పాల్పడ్డ సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
విద్యార్థులను రోహిత్ కుమావత్, శైలేంద్ర కుమార్, దేవేంద్ర కుమార్ అని వీరు వివేకానంద ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారని గుర్తించినట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపాడు. ముగ్గురిపై కాల్పులు జరిపినట్లు మరో ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. రోహిత్ పరిస్థితి విషమంగా ఉందని, దేవేంద్రకు కంటి భాగంలో తీవ్ర గాయమైంది.
ఈ విషయమై వీసీ సందీప్ భక్షిని సంప్రదించగా.. విద్యార్థులు ఫాంహౌస్ లో ప్రవేశించి రెండు కార్లను చోరీ చేసేందుకు యత్నించారని, ప్రమాదవశాత్తూ విద్యార్థులకు గాయాలయ్యాయని చెప్పారు.