సాక్షి, న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎయిమ్స్‌లో డయాలసిస్ చేస్తున్నారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి ముందు కొద్దిరోజుల పాటు జైట్లీకి డయాలసిస్ చేస్తారని చెప్పారు. కిడ్నీలు పనిచేయకుండా విఫలమైన సందర్భంలో రక్తంలో విషపూరిత వ్యర్ధాలు పేరుకుపోకుండా డయాలసిస్ చేస్తారు. ఇతర కాంప్లికేషన్లు లేకుండా సర్జరీ విజయవంతంగా చేపట్టి మెరుగైన రికవరీ కోసం డయాలసిస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నిరోజుల పాటు డయాలసిస్ చేస్తారనేదానిపై ఎయిమ్స్ వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే జైట్లీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరుగుదుందని వెల్లడించారు. ఏ రోజైనా శస్త్రచికిత్స నిర్వహించవచ్చని తెలిపారు.
సర్జరీ కోసం అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు గురువారం మంత్రి జైట్లీ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్ కార్డియో-న్యూరో టవర్‌లో శుక్రవారం చేరిన జైట్లీ అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కిడ్నీ దాతతో పాటు జైట్లీకి పలు పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ దాత వివరాలను వైద్యులు, ఎయిమ్స్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment