'వారి వల్లే ఎన్నికలు ప్రశాంతం' | Jammu and Kashmir polls peacefully completed with cooperation of terrorists | Sakshi
Sakshi News home page

'వారి వల్లే ఎన్నికలు ప్రశాంతం'

Published Mon, Mar 2 2015 1:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:12 PM

'వారి వల్లే ఎన్నికలు ప్రశాంతం' - Sakshi

'వారి వల్లే ఎన్నికలు ప్రశాంతం'

- కశ్మీర్ ఎన్నికల ఘనత ఉగ్ర సంస్థలు, పాక్, హురియత్‌లదే
- జమ్మూకశ్మీర్ కొత్త సీఎం సయీద్ సంచలన వ్యాఖ్యలు

 
జమ్మూ: అధికారంలోకి వచ్చిన మొదటిరోజే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదాల తుట్టెను కదిపారు. సరిహద్దులకావలి ప్రజలు(పాకిస్తాన్), ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాద సంస్థ హురియత్‌ల సహకారం వల్లనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఆ ఘనత వారికే చెందాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాకిస్తాన్‌తో చర్చలు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, అదే విషయం ప్రధానికి కూడా చెప్పానని స్పష్టం చేశారు. ‘సరిహద్దులకు అవతలివైపున్నవారు(పాకిస్తాన్ అనే ఉద్దేశంతో), ఉగ్రవాద సంస్థలు, హురియత్.. వీరే రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించారు. ఎన్నికల ప్రక్రియను విఘాత పర్చేందుకు ఒక చిన్న సంఘటన చాలన్న విషయం మనకందరికీ తెలుసు.
 
ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా సాగేందుకు వారు అనుమతించారు. ఆ సమయంలో వారేమైనా చేసి ఉంటే ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరిగేవి కావు. ఈ విషయాన్ని నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను.. సాధికారికంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ ఘనతను వారికే ఇవ్వాలని నేను ప్రధానితో కూడా చెప్పాను’ అని ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సయీద్‌కు ఇరుపక్కల ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్(బీజేపీ), మరో మంత్రి హసీబ్ ద్రాబు(పీడీపీ) ఉన్నారు. సయీద్ వ్యాఖ్యలపై బీజేపీ  స్పందిస్తూ.. ‘ఎన్నికల సంఘం, భారత సైన్యం, రాష్ట్ర పోలీస్ సహా భద్రతా బలగాలు, భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నవారు.. వీరందరి సమష్టి కృషి వల్లనే జమ్మూకశ్మీర్లో ఎన్నికల నిర్వహణ సజావుగా, ప్రశాంతంగా సాగింది’ అని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఢిల్లీలో పేర్కొన్నారు.
 
సజ్జాద్ లోన్ మార్గం వేశారు
అలాగే, కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చర్చలొక్కటే మార్గమని ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తేల్చి చెప్పారు. పాక్‌తో చర్చల విషయమై ప్రధాని నుంచి హామీ ఏమైనా వచ్చిందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘హామీ అవసరమేం లేదు. ప్రధాని మోదీతో నేను సమావేశమైనప్పుడు.. పాక్‌తో చర్చలపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. చర్చలు తప్ప ప్రత్యామ్నాయం లేదని వివరించాను. మనమే పాక్ వెళ్లి చర్చలు జరిపితే ఏమవుతుందని ప్రశ్నించాను. అప్పుడు.. పాక్‌తో చర్చలు ప్రారంభించే బాధ్యతను విదేశాంగ కార్యదర్శికి అప్పగించానని ప్రధాని నాకు చెప్పారు. పాక్‌కు వెళ్లి చర్చల ప్రక్రియపై సంప్రదింపులు జరపమని ఆదేశించానన్నారు’ అని సయీద్ వివరించారు. ‘నియంత్రణ రేఖ వెంట వాఘా తరహా కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలి. ప్రయాణం, వాణిజ్యం సులభతరం చేయాలి’ అన్నారు.
 
కశ్మీర్‌లోయలోని వేర్పాటువాదుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సయీద్ పేర్కొన్నారు. అవసరం ప్రాతిపదికగా కాకుండా, సిద్ధాంతాలు ప్రాతిపదికగా పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల హృదయాల మధ్య దూరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కృషి చేస్తానని చెప్పారు. మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్ లోన్ మంత్రివర్గంలో చేరడంపై స్పందిస్తూ.. మరింతమంది వేర్పాటువాద నేతలు ప్రజాస్వామ్య స్రవంతిలో చేరేందుకు ఈ చర్య మార్గం వేస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. భద్రతాదళాలు తప్పులు చేయడాన్ని అనుమతించబోమని, వారిలో జవాబుదారీ తనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
 
వాజ్‌పేయి దార్శనికుడు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై సయీద్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో, పార్లమెంటుపై దాడి అనంతరం వాజ్‌పేయి గొప్ప సంయమనాన్ని ప్రదర్శించారు. ఆయన గొప్ప దార్శనికుడు’ అని కొనియాడారు. వాజ్‌పేయి పేర్కొన్న ఇన్సానియత్.. జమ్హూరియత్.. కశ్మీరియత్’ సిద్ధాంతాన్ని తన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ‘నెహ్రూ నుంచి మోదీ వరకు.. అందరు ప్రధానుల ముందు కశ్మీర్ ఒక సమస్యగా నిలిచింది. ఆ పరంపరను మార్చేందుకు మాకో అవకాశం లభించింది’ అన్నారు. కశ్మీర్ ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. కాగా, సయీద్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి హురియత్, మిలిటెంట్ సంస్థలు అనుమతించాయని సయీద్ సాబ్ చెబుతున్నారు. హురియత్, మిలిటెంట్ సంస్థల పెద్ద మనసుకు మనం కృతజ్ఞులై ఉండాలనుకుంటా. ఎన్నికల సజావు నిర్వహణలో భద్రతా బలగాలు నిర్వహించిన పాత్ర ఏమిటో బీజేపీ వారు.. మీరు కాస్త చెప్పండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
 
సయీద్ రాజకీయ ప్రస్థానం

కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ది సుదీర్ఘ చరిత్ర. రాజకీయ ప్రస్థానం విజయాలు, వివాదాల కలబోత. దేశంలో తొలి ముస్లిం హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సయీద్.. పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే విమర్శలపాలయ్యారు. 1989లో వీపీ సింగ్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన తన కుమార్తె రుబయా కిడ్నాప్ ఉదంతంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాడు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుదీరిన 5 రోజులకే రుబయాను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. జైలు నుంచి ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెడితేనే ఆమెను విడుదల చేస్తామన్నారు. చేశారు. సయీద్ ఒత్తిడితో వీపీ సింగ్ ప్రభుత్వం అందుకంగీకరించింది. సయీద్ హోంమంత్రిగా ఉన్నప్పుడే కశ్మీర్‌లో చొరబాట్లు పెరిగి, కశ్మీరీ పండిట్లు వలసవెళ్లారనే  విమర్శలున్నాయి. 1999లో కూతురు మెహబూబాతో కలిసి జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన సయీద్ అంతకుముందు కాంగ్రెస్, జనమోర్చా, జీఎం సాదిక్ నేతృత్వంలోని డెమోక్రటిక్ నేషనల్ కాంగ్రెస్‌లో పనిచేశారు. పార్టీని స్థాపించిన మూడేళ్లలోనే కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2008లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చేతిలో ఓటమి చవిచూశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement