CM Mufti Mohammad Sayeed
-
కశ్మీర్లో కలిసే సాగుతాం..: పీడీపీ, బీజేపీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు, అనిశ్చితికి, ఊహాగానాలకు తెరపడింది. పీడీపీ, బీజేపీల పొత్తు కొనసాగుతుందని, సంవత్సరం క్రితం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వ ఎజెండానే కొనసాగుతుందని మంగళవారం ఆ రెండు పార్టీలు స్పష్టం చేశాయి. ఇటీవల మరణించిన సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీనే తదుపరి సీఎం అని, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రెండు పార్టీలు తాజాగా ఎలాంటి షరతులు విధించలేదని వివరించాయి. అయితే, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడున్నదానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. పీడీపీతో పొత్తులో క్రియాశీలంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
కశ్మీర్లో కొత్త సర్కారు ఏర్పాటు ఆలస్యం
-
కశ్మీర్లో కొత్త సర్కారు ఏర్పాటు ఆలస్యం
శ్రీనగర్: సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతి నేపథ్యంలో.. జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొద్దిగా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సంతాప దినాలుగా పాటించే తొలి 4 రోజులు ముగిసేంతవరకు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విముఖంగా ఉన్నారు. ‘బాధలో ఉన్న మా నాయకురాలికి కనీస సమయం ఇవ్వకుండా ప్రమాణం చేయాలని ఎలా అడగగలం?’ అని పీడీపీ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేని కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభమేమీ ఏర్పడబోదని, కొత్త సీఎం వచ్చేవరకు గవర్నర్ ఆపద్ధర్మ బాధ్యతలు నిర్వర్తిస్తారని అన్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరిని స్పష్టంగా వెల్లడించాలంటూ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అధికార సంకీర్ణ పక్షాలు పీడీపీ, బీజేపీలను ఆదేశించారు. పీడీపీతో సంకీర్ణం విషయంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేత రామ్‌మాధవ్ శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అయితే, ఆ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు రామ్‌మాధవ్ మెహబూబా ముఫ్తీని కలుసుకుని ఆమె తండ్రి మృతిపై సంతాపం తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు గురించీ ఆమెతో కాసేపు చర్చించానని ఆయన మీడియాకు తెలిపారు. మెహబూబా ముఫ్తీని తమ తదుపరి నేతగా ఎన్నుకున్నామని పీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కొత్త సీఎం ఎవరనే విషయం పీడీపీకే వదలేస్తున్నట్లు గురువారం బీజేపీ కూడా వ్యాఖ్యానించింది. -
హెలీకాప్టర్ కూలి ఏడుగురు మృతి
కశ్మీర్లో ఘటన మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన పైలట్ సుమిత జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా కట్రా వద్ద హెలీకాప్టర్ కూలి ఆరుగురు యాత్రికులు, హైదరాబాద్‌కు చెందిన మహిళా పైలట్ సుమిత విజయన్ మృతిచెందారు. హిమాలయన్ హెలీకి చెందిన హెలీకాప్టర్.. త్రికూట హిల్స్‌లోని సంజిచాట్ హెలీప్యాడ్ నుంచి వైష్ణోదేవీ ఆలయానికి యాత్రికులను తీసుకుని వస్తుండగా కత్రా కొత్త బస్టాండ్ వద్ద ప్రమాదం జరిగిందని జమ్మూ ఐజీపీ దినేశ్ రాణా తెలిపారు. ఆలయం వద్దకు వస్తున్నప్పుడు చాపర్‌కు పక్షి తగిలి మంటలు చెలరేగాయి. దీంతో చాపర్‌ను బస్టాండ్ వద్ద లాండ్ చేయడానికి యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట కూడా మృతిచెందింది. మృతులు అర్జున్ సింగ్, మహేశ్, వందన జమ్మూకు చెందిన వారు కాగా.. సచిన్, అక్షిత(5), అర్యన్జీత్ ఢిల్లీ నివాసులు. యాత్రికులకు రూ.25 లక్షల ప్రమాద బీమా ఉందని, అలాగే ఆలయ బోర్డు రూ.3లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి నట్లు వైష్ణోదేవి ఆలయ బోర్డు అదనపు సీఈవో అజిత్ కుమార్ తెలిపారు. కాగా, ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. వైష్ణోదేవీ ఆలయం వద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. -
కొలువుదీరిన బీజేపీ, పీడీపీ సంకీర్ణం
- జమ్మూకశ్మీర్ సీఎంగా సయీద్ ప్రమాణం; డిప్యూటీగా నిర్మల్ సింగ్ - హాజరైన ప్రధాని మోదీ, అద్వానీ, అమిత్ షా - రాష్ట్రంలో తొలిసారి అధికారంలో బీజేపీ జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో 49 రోజుల గవర్నర్ పాలనకు తెరపడింది. పీడీపీ- బీజేపీ సంకీర్ణం ఆదివారం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికారంలో భాగస్వామి అయింది. రాష్ట్ర 12వ సీఎంగా పీడీపీ సీనియర్ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్(79), ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. పీడీపీ నుంచి మరో 12మంది, బీజేపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్‌ల నుంచి మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాద నేత, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జాద్ లోన్ కేబినెట్ మంత్రిగా సయీద్ మంత్రివర్గంలో చేరారు. ప్రియా సేథీ(బీజేపీ), ఆషియా నఖాష్(పీడీపీ) ఈ సంకీర్ణ సర్కారులోని మహిళా మంత్రులు. జమ్మూ వర్సిటీలోని జొరావర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్ షా, సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, రామ్‌మాధవ్ తదితరులు హాజరయ్యారు. ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కర్యక్రమాన్ని బహిష్కరించగా, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సైఫుద్దీన్ సోజ్ హాజరయ్యారు. అనంతరం సయీద్ మంత్రివర్గానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణం అనంతరంలోన్ను మోదీ ఆత్మీయంగా గాఢాలింగనం చేసుకోవడం విశేషం. ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో కీలకంగా వ్యవహరించి, ఇరు పార్టీల మధ్య విభేదాల పరిష్కారానికి కృషిచేసిన పీడీపీ ఎమ్మెల్యే ద్రాబును కూడా ప్రధాని ఆత్మీయంగా కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం,కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేర్చేందుకు పీడీపీ, బీజేపీలకు లభించిన చరిత్రాత్మక అవకాశంగా దీన్ని అభివర్ణిస్తూ వట్వీట్ చేశారు. ప్రమాణం తర్వాత సయీద్, నిర్మల్ సింగ్‌లు సంకీర్ణ ప్రభుత్వ ఎజెండాను విడుదల చేశారు. గతంలో, 2002 జనవరి నుంచి మూడేళ్లపాటు పీడీపీ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సయీద్ సీఎంగా వ్యవహరించారు. వ్యతిరేకించిన రాజ్యాంగానికి విధేయతా..? నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం టఒమర్ అబ్దుల్లా కొత్త సీఎం సయీద్‌కు ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ రాజ్యాంగాన్ని అంగీకరించని బీజేపీ.. ఆ రాజ్యాంగానికి విధేయత ప్రకటిస్తూ తన మంత్రులు ప్రమాణం చేయడాన్ని ఎలా అనుమతించిందంటూ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించే ప్రయత్నంలోనే బీజేపీ పార్టీ సైద్ధాంతికవేత్త శ్యామాప్రసాద్ ముఖర్జీ మరణించిన విషయాన్ని ఒమర్ గుర్తు చేశారు. -
'వారి వల్లే ఎన్నికలు ప్రశాంతం'
- కశ్మీర్ ఎన్నికల ఘనత ఉగ్ర సంస్థలు, పాక్, హురియత్లదే - జమ్మూకశ్మీర్ కొత్త సీఎం సయీద్ సంచలన వ్యాఖ్యలు జమ్మూ: అధికారంలోకి వచ్చిన మొదటిరోజే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదాల తుట్టెను కదిపారు. సరిహద్దులకావలి ప్రజలు(పాకిస్తాన్), ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాద సంస్థ హురియత్‌ల సహకారం వల్లనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఆ ఘనత వారికే చెందాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాకిస్తాన్‌తో చర్చలు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, అదే విషయం ప్రధానికి కూడా చెప్పానని స్పష్టం చేశారు. ‘సరిహద్దులకు అవతలివైపున్నవారు(పాకిస్తాన్ అనే ఉద్దేశంతో), ఉగ్రవాద సంస్థలు, హురియత్.. వీరే రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించారు. ఎన్నికల ప్రక్రియను విఘాత పర్చేందుకు ఒక చిన్న సంఘటన చాలన్న విషయం మనకందరికీ తెలుసు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా సాగేందుకు వారు అనుమతించారు. ఆ సమయంలో వారేమైనా చేసి ఉంటే ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరిగేవి కావు. ఈ విషయాన్ని నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను.. సాధికారికంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ ఘనతను వారికే ఇవ్వాలని నేను ప్రధానితో కూడా చెప్పాను’ అని ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సయీద్‌కు ఇరుపక్కల ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్(బీజేపీ), మరో మంత్రి హసీబ్ ద్రాబు(పీడీపీ) ఉన్నారు. సయీద్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. ‘ఎన్నికల సంఘం, భారత సైన్యం, రాష్ట్ర పోలీస్ సహా భద్రతా బలగాలు, భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నవారు.. వీరందరి సమష్టి కృషి వల్లనే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ సజావుగా, ప్రశాంతంగా సాగింది’ అని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఢిల్లీలో పేర్కొన్నారు. సజ్జాద్ లోన్ మార్గం వేశారు అలాగే, కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చర్చలొక్కటే మార్గమని ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తేల్చి చెప్పారు. పాక్‌తో చర్చల విషయమై ప్రధాని నుంచి హామీ ఏమైనా వచ్చిందా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘హామీ అవసరమేం లేదు. ప్రధాని మోదీతో నేను సమావేశమైనప్పుడు.. పాక్‌తో చర్చలపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. చర్చలు తప్ప ప్రత్యామ్నాయం లేదని వివరించాను. మనమే పాక్ వెళ్లి చర్చలు జరిపితే ఏమవుతుందని ప్రశ్నించాను. అప్పుడు.. పాక్‌తో చర్చలు ప్రారంభించే బాధ్యతను విదేశాంగ కార్యదర్శికి అప్పగించానని ప్రధాని నాకు చెప్పారు. పాక్‌కు వెళ్లి చర్చల ప్రక్రియపై సంప్రదింపులు జరపమని ఆదేశించానన్నారు’ అని సయీద్ వివరించారు. ‘నియంత్రణ రేఖ వెంట వాఘా తరహా కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలి. ప్రయాణం, వాణిజ్యం సులభతరం చేయాలి’ అన్నారు. కశ్మీర్‌లోయలోని వేర్పాటువాదుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సయీద్ పేర్కొన్నారు. అవసరం ప్రాతిపదికగా కాకుండా, సిద్ధాంతాలు ప్రాతిపదికగా పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల హృదయాల మధ్య దూరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కృషి చేస్తానని చెప్పారు. మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్ లోన్ మంత్రివర్గంలో చేరడంపై స్పందిస్తూ.. మరింతమంది వేర్పాటువాద నేతలు ప్రజాస్వామ్య స్రవంతిలో చేరేందుకు ఈ చర్య మార్గం వేస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. భద్రతాదళాలు తప్పులు చేయడాన్ని అనుమతించబోమని, వారిలో జవాబుదారీ తనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వాజ్‌పేయి దార్శనికుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై సయీద్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో, పార్లమెంటుపై దాడి అనంతరం వాజ్‌పేయి గొప్ప సంయమనాన్ని ప్రదర్శించారు. ఆయన గొప్ప దార్శనికుడు’ అని కొనియాడారు. వాజ్‌పేయి పేర్కొన్న ఇన్సానియత్.. జమ్హూరియత్.. కశ్మీరియత్’ సిద్ధాంతాన్ని తన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ‘నెహ్రూ నుంచి మోదీ వరకు.. అందరు ప్రధానుల ముందు కశ్మీర్ ఒక సమస్యగా నిలిచింది. ఆ పరంపరను మార్చేందుకు మాకో అవకాశం లభించింది’ అన్నారు. కశ్మీర్ ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. కాగా, సయీద్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి హురియత్, మిలిటెంట్ సంస్థలు అనుమతించాయని సయీద్ సాబ్ చెబుతున్నారు. హురియత్, మిలిటెంట్ సంస్థల పెద్ద మనసుకు మనం కృతజ్ఞులై ఉండాలనుకుంటా. ఎన్నికల సజావు నిర్వహణలో భద్రతా బలగాలు నిర్వహించిన పాత్ర ఏమిటో బీజేపీ వారు.. మీరు కాస్త చెప్పండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సయీద్ రాజకీయ ప్రస్థానం కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ది సుదీర్ఘ చరిత్ర. రాజకీయ ప్రస్థానం విజయాలు, వివాదాల కలబోత. దేశంలో తొలి ముస్లిం హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సయీద్.. పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే విమర్శలపాలయ్యారు. 1989లో వీపీ సింగ్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన తన కుమార్తె రుబయా కిడ్నాప్ ఉదంతంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాడు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుదీరిన 5 రోజులకే రుబయాను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. జైలు నుంచి ఐదుగురు ఉగ్రవాదులను విడిచిపెడితేనే ఆమెను విడుదల చేస్తామన్నారు. చేశారు. సయీద్ ఒత్తిడితో వీపీ సింగ్ ప్రభుత్వం అందుకంగీకరించింది. సయీద్ హోంమంత్రిగా ఉన్నప్పుడే కశ్మీర్లో చొరబాట్లు పెరిగి, కశ్మీరీ పండిట్లు వలసవెళ్లారనే విమర్శలున్నాయి. 1999లో కూతురు మెహబూబాతో కలిసి జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన సయీద్ అంతకుముందు కాంగ్రెస్, జనమోర్చా, జీఎం సాదిక్ నేతృత్వంలోని డెమోక్రటిక్ నేషనల్ కాంగ్రెస్‌లో పనిచేశారు. పార్టీని స్థాపించిన మూడేళ్లలోనే కాంగ్రెస్‌తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2008లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చేతిలో ఓటమి చవిచూశారు.