సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతి నేపథ్యంలో.. జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొద్దిగా ఆలస్యమయ్యేలా
శ్రీనగర్: సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతి నేపథ్యంలో.. జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొద్దిగా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సంతాప దినాలుగా పాటించే తొలి 4 రోజులు ముగిసేంతవరకు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విముఖంగా ఉన్నారు. ‘బాధలో ఉన్న మా నాయకురాలికి కనీస సమయం ఇవ్వకుండా ప్రమాణం చేయాలని ఎలా అడగగలం?’ అని పీడీపీ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేని కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభమేమీ ఏర్పడబోదని, కొత్త సీఎం వచ్చేవరకు గవర్నర్ ఆపద్ధర్మ బాధ్యతలు నిర్వర్తిస్తారని అన్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరిని స్పష్టంగా వెల్లడించాలంటూ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా శుక్రవారం అధికార సంకీర్ణ పక్షాలు పీడీపీ, బీజేపీలను ఆదేశించారు.
పీడీపీతో సంకీర్ణం విషయంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేత రామ్‌మాధవ్ శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అయితే, ఆ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు రామ్‌మాధవ్ మెహబూబా ముఫ్తీని కలుసుకుని ఆమె తండ్రి మృతిపై సంతాపం తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు గురించీ ఆమెతో కాసేపు చర్చించానని ఆయన మీడియాకు తెలిపారు. మెహబూబా ముఫ్తీని తమ తదుపరి నేతగా ఎన్నుకున్నామని పీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే గవర్నర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కొత్త సీఎం ఎవరనే విషయం పీడీపీకే వదలేస్తున్నట్లు గురువారం బీజేపీ కూడా వ్యాఖ్యానించింది.