'భారత్ మాతకీ జై' అని మెహబూబా అంటారా?'
ముంబై: బీజేపీతో చేతులు కలిపి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో కమలనాథులపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ప్రశ్నల వర్షం కురిపించింది. జమ్ముకశ్మీర్ మొదటి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న మెహబూబా ముఫ్తి 'భారత్ మాతకీ జై' అని ఇప్పుడు నినదిస్తారా? ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన కశ్మీర్ పండిట్స్ గౌరవార్థం ఆమె ఈ నినాదం చేస్తారా? అని శివసేన ప్రశ్నించింది.
రెండు నెలల ప్రతిష్టంభనకు తెరదించుతూ జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తి శనివారం గవర్నర్‌ను కలిసి విషయం తెలిసిందే. బీజేపీతో గతంలో పెట్టుకున్న పొత్తును యథాతథంగా కొనసాగిస్తూ.. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
'బీజేపీకి, మెహబూబాకు మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. ఆమె దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, ఉగ్రవాదుల పట్ల ఆమె చూపిన ఆపేక్ష గతంలో వివాదాలు సృష్టించింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపట్ల ఆమె ఉదార వైఖరిని కనబర్చారు' అని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో పేర్కొంది.
'ఆమె ముఖ్యమంత్రి పదవి స్వీకరించడంపై బీజేపీ సంతృప్తిగా ఉండవచ్చు, కానీ దేశం ఆందోళన చెందుతున్నది. 'భారత మాతకీ జై' అనడం దేశభక్తికి, జాతీయవాదానికి చిహ్నంగా బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు మెహబూబా ఈ నినాదాన్ని చేయగలరా?' అని 'సామ్నా' ప్రశ్నించింది.