కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతాయి!
శ్రీనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం జమ్మూకశ్మీర్‌లోని తమ పార్టీ నేతలతో విస్తారంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలోని ప్రముఖులు, పౌరసంఘాల నాయకులతో ముచ్చటించారు. జమ్ములో జరుగుతున్న ఈ చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ ఆదివారం కొనసాగనుంది. తాను తలపెట్టిన 95రోజుల దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రెండురోజుల జమ్మూ పర్యటనకు అమిత్‌షా వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా, 2014 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 120 సీట్లలో అదనంగా పాగా వేయడమే వ్యూహంగా షా పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే.
అమిత్ షా బీజేపా శాసనసభ్యులు, నేతలు, జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో భేటీ అయి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆయన రాష్ట్ర బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యుల కోర్ కమిటీతో ముఖాముఖి సమావేశమయ్యారు. అలాగే బీజేపీ-పీడీపీ ప్రభుత్వంలోని పలువురు సీనియర్ బీజేపీ మంత్రులతో ముచ్చటించారు. కశ్మీర్ లోయ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతున్న నేపథ్యంలో అమిత్ షా చేపట్టిన ఈ మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కశ్మీర్‌లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని, అధికార మిత్రపక్షంతో పీడీపీతో ఉన్న విభేదాలు సైతం తొలిగిపోయి.. అన్ని సమస్యలు త్వరలోనే చక్కబడతాయని ఈ సందర్భంగా పార్టీ నేతలకు అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.