ఉక్కుపాదంతో అణిచేయండి: బీజేపీ
జమ్ము: కశ్మీర్ లో 31 రోజులుగా కొనసాగుతున్న ఉద్రక్తతలను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి మొహబూబా శాంతి మార్గాలను అణ్వేషిస్తుండగా, ఆమె ప్రభుత్వ భాగస్వామి బీజేపీ భిన్నంగా స్పందించింది. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, లేకుంటే పరిస్థితులు ఎప్పటికీ అదుపులోకిరావని కశ్మీర్ బీజేపీ శాఖ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా సోమవారం శ్రీనగర్ లో మాట్లాడుతూ.. అణిచివేత తప్ప ప్రభుత్వానికి మరో మార్గమేలేదని, ఆ దిశగా ప్రభుత్వం కదిలిరావాలని అన్నారు.
కశ్మీర్ లో ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్, ఇతర ఆధునిక ఆయుధాలు ప్రయోగించరాదన్న కేంద్రం సూచనతో పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాల చేతులకు సంకెళ్లు పడ్డట్లయిందని గుప్తా అన్నారు. పాక్ ప్రోద్బలంతో జరుగుతున్న ఆందోళనలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టవని, అందుకే ప్రభుత్వం ఉదాసీన వైఖరిని వీడి ప్రతాపం చూపాలని పేర్కొన్నారు. కాగా, సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ లను కలిసిన జమ్ముకశ్మీర్ సీఎం మొహబూబా ముఫ్తీ.. ‘కశ్మీరీలతో మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఈ విషయంలో ప్రధాని చొరవ చూపుతారని ఆశిస్తున్నా. నాడు వాజ్‌పేయిలా నేడు మోదీ కూడా సమస్యను పరిష్కరించి కశ్మీరీల హృదయాలు గెలవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.