- జమ్మూకశ్మీర్ సీఎంగా సయీద్ ప్రమాణం; డిప్యూటీగా నిర్మల్ సింగ్
- హాజరైన ప్రధాని మోదీ, అద్వానీ, అమిత్ షా
- రాష్ట్రంలో తొలిసారి అధికారంలో బీజేపీ
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో 49 రోజుల గవర్నర్ పాలనకు తెరపడింది. పీడీపీ- బీజేపీ సంకీర్ణం ఆదివారం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికారంలో భాగస్వామి అయింది. రాష్ట్ర 12వ సీఎంగా పీడీపీ సీనియర్ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్(79), ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. పీడీపీ నుంచి మరో 12మంది, బీజేపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్‌ల నుంచి మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాద నేత, పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జాద్ లోన్ కేబినెట్ మంత్రిగా సయీద్ మంత్రివర్గంలో చేరారు. ప్రియా సేథీ(బీజేపీ), ఆషియా నఖాష్(పీడీపీ) ఈ సంకీర్ణ సర్కారులోని మహిళా మంత్రులు. జమ్మూ వర్సిటీలోని జొరావర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్ షా, సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, రామ్‌మాధవ్ తదితరులు హాజరయ్యారు.
ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కర్యక్రమాన్ని బహిష్కరించగా, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సైఫుద్దీన్ సోజ్ హాజరయ్యారు. అనంతరం సయీద్ మంత్రివర్గానికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణం అనంతరంలోన్‌ను మోదీ ఆత్మీయంగా గాఢాలింగనం చేసుకోవడం విశేషం. ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో కీలకంగా వ్యవహరించి, ఇరు పార్టీల మధ్య విభేదాల పరిష్కారానికి కృషిచేసిన పీడీపీ ఎమ్మెల్యే ద్రాబును కూడా ప్రధాని ఆత్మీయంగా కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం,కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేర్చేందుకు పీడీపీ, బీజేపీలకు లభించిన చరిత్రాత్మక అవకాశంగా దీన్ని అభివర్ణిస్తూ వట్వీట్ చేశారు. ప్రమాణం తర్వాత సయీద్, నిర్మల్ సింగ్‌లు సంకీర్ణ ప్రభుత్వ ఎజెండాను విడుదల చేశారు. గతంలో, 2002 జనవరి నుంచి మూడేళ్లపాటు పీడీపీ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సయీద్ సీఎంగా వ్యవహరించారు.
వ్యతిరేకించిన రాజ్యాంగానికి విధేయతా..? నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం టఒమర్ అబ్దుల్లా కొత్త సీఎం సయీద్‌కు ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ రాజ్యాంగాన్ని అంగీకరించని బీజేపీ.. ఆ రాజ్యాంగానికి విధేయత ప్రకటిస్తూ తన మంత్రులు ప్రమాణం చేయడాన్ని ఎలా అనుమతించిందంటూ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించే ప్రయత్నంలోనే బీజేపీ పార్టీ సైద్ధాంతికవేత్త శ్యామాప్రసాద్ ముఖర్జీ మరణించిన విషయాన్ని ఒమర్ గుర్తు చేశారు.
కొలువుదీరిన బీజేపీ, పీడీపీ సంకీర్ణం
Published Mon, Mar 2 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement