హాళ్లలో ‘జనగణమన’ తప్పనిసరి
సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ఆలపించాలన్న సుప్రీంకోర్టు
గౌరవ సూచకంగా ప్రజలు లేచి నిలబడాలి
న్యూఢిల్లీ: ప్రజల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకుగానూ సినిమా హాళ్లలో జాతీయ గీతం ‘జనగణమన’ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందు దేశమంతటా సినిమా థియేటర్లన్నీ జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశించింది. జాతీయగీతాన్ని ప్రదర్శించే సమయంలో తెరపై జాతీయ జెండా కనిపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడాలని సూచించింది. జాతీయ గీతం, జాతీయ జెండాను గౌరవించడం దేశంలోని ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది. ‘‘జాతీయ జెండా, జాతీయ గీతంపై గౌరవమే మాతృభూమిపై వారికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని ప్రతిఫలిస్తుంది.
ఇది నా దేశం. నా మాతృభూమి అని ప్రజలంతా భావించాలి. ఇది వ్యక్తుల్లో జాతీయభావాన్ని, దేశభక్తిని పెంపొందిస్తుంది. జాతీయభావం అనే దానిని శాస్త్రాలు కూడా ఆమోదించారుు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్‌మిశ్రా, అమితవరాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని, అలాగే అధికారిక ఫంక్షన్లు, కార్యక్రమాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు సరైన నిబంధనలను, ప్రొటోకాల్‌ను నిర్దేశించాలని కోరుతూ శ్యామ్ నారాయణ చౌస్కి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14కు వారుుదా వేసింది.
జాతీయ గీతం ప్రాముఖ్యత దృష్ట్యా దానిని ప్రదర్శించే లేదా ఆలపించే సమయంలో సినిమా థియేటర్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసి ఉంచాలని, దీని వల్ల ఎవరూ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచే అవకాశం ఉండదని, అందువల్ల జాతీయ గీతాన్ని ప్రదర్శించిన తర్వాత మాత్రమే సినిమా హాళ్ల తలుపులు తెరవాలని స్పష్టం చేసింది. జాతీయ గీతాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకోవడం లేదా నాటకీయంగా మలచడం వంటి చర్యలను ఏ ఒక్కరూ చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే అవాంఛనీయ వస్తువులపై జాతీయ గీతాన్ని ముద్రించడంగానీ లేదా జాతీయ గీతాన్ని అగౌరవపరిచే ప్రదేశాల్లో దానిని ప్రదర్శించడం గానీ చేయకూడదని, వెరైటీ షోల్లో సంక్షిప్తీకరించిన జాతీయగీతాన్ని ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పది రోజుల గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ జాతీయ గీతాన్ని అందరూ గౌరవించాల్సిందే అని చెప్పారు. కోర్టు ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు అందజేస్తామని న్యాయస్థానానికి నివేదించారు. కోర్టు ఆదేశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేలా కూడా చూస్తామని, దీని వల్ల అందరూ దీనిని ఆచరించేందుకు, తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు.
పార్లమెంటులోనూ పాడమనండి..
కోర్టు ఆదేశాలపై సినీదర్శకుడు శేఖర్ కపూర్, నిర్మాత శిరీష్ కుందేర్‌లు మండిపడ్డారు. ‘ప్రతి సమావేశానికి ముందు జాతీయగీతాన్ని పాడాలని పార్లమెంటును కోర్టు ఆదేశించాలి. ఎందుకంటే పార్లమెంటు డ్రామా సినిమాలాగే ఉంటుంది’ అని కపూర్ అన్నారు. ‘జాతీయగీతాలాపన సమయంలో లేచి నిలబడకపోతే కాల్చేస్తారా? జైలుకు పంపుతారా? ఉరితీస్తారా?’ అని కుందేర్ విరుచుకుపడ్డారు. రెస్టారెంట్లలో తినడానికి ముందు దీన్ని పాడించాలని ఎద్దేవా చేశారు.
దేశభక్తిని పెంపొందిస్తుంది: బీజేపీ
జాతీయ గీతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ అనే స్ఫూర్తికి ఇది ఉపకరిస్తుందని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయమని, ఈ తీర్పుతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి మరింత పెంపొందుతుందని చెప్పారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీం ఆదేశాలను స్వాగతించారు. అరుుతే ఈ నిర్ణయం దేశభక్తి లేదా జాతీయభావాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.