వందకోట్లు వైట్‌మనీగా మార్చారు!
గాలి కూతురి పెళ్లి కోసం 20% కమీషన్‌పై డబ్బు మార్పు
► కర్ణాటక అధికారి భీమానాయక్ డ్రైవర్ సూసైడ్ నోట్‌లో వెల్లడి
► లేఖలో ప్రభుత్వాధికారి భీమా నాయక్ అక్రమాస్తుల వివరాలు
బెంగళూరు: పారిశ్రామికవేత్త గాలి జనార్దన రెడ్డి.. కూతురి పెళ్లి కోసం రూ.100 కోట్ల నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చారని.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రభుత్వాధికారి డ్రైవర్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. బెంగళూరలో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్.. డ్రైవర్ కేసీ రమేశ్ గౌడ.. మాండ్యలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గదినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖలో గాలి కూతురి పెళ్లికి నల్లధనం ఎలా చెలామణిలోకి వచ్చిందీ, భీమానాయక్ అక్రమాలు, అక్రమాస్తుల వివరాలున్నాయి. ఈ వివరాలన్నీ తనకు తెలియటంతోనే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రమేశ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘అక్టోబర్ 28న భీమానాయక్, మరో వ్యక్తితో కలిసి.. ఓ గెస్ట్ హౌజ్‌లో బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి జనార్దన రెడ్డిలను కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హగరిబొమ్మనహల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్న ఆ వ్యక్తి.. అందుకోసం రూ.25 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని లేఖలో రమేశ్ పేర్కొన్నారు. గాలి కూతురి పెళ్లికి రూ.25 కోట్ల వైట్ మనీని ఎలా తెచ్చిందీ నవంబర్ 15న ఓ హోటల్లో తనముందే చెప్పారన్నారు. అవి కాకుండా.. రూ.100 కోట్లను 20 శాతం కమీషన్‌కు మార్చుకున్న తీరును రమేశ్ తన లేఖలో వివరించారు. అలాగే, శ్రీరాములు ఇంటికీ నాయక్ వెళ్లిన సందర్భాలు.. ఆయా సమయాల్లో వాడిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లనూ రమేశ్ లేఖలో పేర్కొన్నారు.ఇవన్నీ తనకు తెలియటంతో చంపించేస్తామని బెదిరించారన్నారు.
భీమ్ నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలనూ రమేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. నాయక్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ మొహమ్మద్‌లే తన ఆత్మహత్యకు కారణమన్నారు. తనకు జీతం రాకుండా మూడు నెలలు అడ్డుకున్నారన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అంగరంగ వైభవంగా తన కూతురు వివాహాన్ని చేసిన గాలిపై ఐటీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఆరోపణలు అవాస్తవమని.. తమ పరువు తీసేందుకు ఆడుతున్న కుట్రలో భాగమని ఎంపీ శ్రీరాములు ఢిల్లీలో తెలిపారు. కాగా.. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.