కేరళలో జన్మాష్టమి వేడుకలపై వివాదం
కేరళలో జన్మాష్టమి వేడుకలపై వివాదం
Published Sun, Sep 17 2017 8:03 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
సాక్షి, తిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పిల్లలను హింసిస్తున్నారంటూ హిందుత్వ సంఘాలపై సీపీఐ(ఎం) భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వరుసగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి.
కన్నూర్ జిల్లా తలిపరంబలో శనివారం బాలగోకులం(సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ) అనే సంస్థ జన్మాష్టమి ర్యాలీ నిర్వహించింది. ఓ మూడేళ్ల పిల్లాడికి శ్రీకృష్ణుడి వేషాధారణ చేసి ఓ వాహనంపైన పడుకోబెట్టి ఊరేగింపు చేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన వామపక్ష సంస్థ బాల సంఘం పోలీస్ ఫిర్యాదు చేసింది. పిల్లలను హింసించారన్న ఆరోపణలపై వారిపై కేసు నమోదు చేసినట్లు కన్నూర్ డీఎస్పీ కేవీ వేణుగోపాల్ తెలిపారు.
అయితే పిల్లలెవరినీ హింసించలేదని, అన్ని రక్షణ చర్యలతోనే వారిని ఊరేగింపుగా తీసుకెళ్లామని, పైగా తల్లిదండ్రుల నుంచి అనుమతి కూడా తీసుకున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యప్రకాశ్ చెబుతున్నారు. పిల్లలను స్వచ్ఛందంగా పంపటం ద్వారా స్వయంగా ఆ శ్రీకృష్ణుడికే సేవ చేసినట్లు తల్లిదండ్రులు భావిస్తారు. కానీ, కొందరు దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారు. గతంలో వాళ్లు (సీపీఎంకు చెందిన బాల సంఘం) కూడా పిల్లలతో ఇలాంటి ర్యాలీలే నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి అని ఆయన అంటున్నారు.
కాగా, పయ్యన్నూర్ లో వివేకానంద సమితి అనే సంస్థ శుక్రవారం కూడా ఇదే రీతిలో ఓ మూడేళ్ల చిన్నారిని ఓ ఆకుపై పడుకోబెట్టి వాహనంపై ఊరేగించిన విషయం తెలిసిందే. ఈ అంశపై తక్షణమే స్పందించాలని శ్రీకాంత్ ఉషా ప్రభాకరన్ అనే సామాజిక వేత్త బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement