ది కేరళ స్టోరీ చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు మిన్నంటుతున్నాయి. మే 5వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈలోపే దానిని బ్యాన్ చేయించే దిశగా రాజకీయంగానూ పావులు కదులుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు ఈ చిత్రాన్ని ప్రొపగాండా చిత్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో చిత్ర నిర్మాత విపుల్ మాత్రం ఆ నిరసలను స్వాగతిస్తూనే.. తాను వాస్తవాల్ని చూపించానని, అది అంతా అంగీకరించాలని అంటున్నాడు.
ది కేరళ స్టోరీలో.. చూపించిన కథాంశం వాస్తవమని నిరూపించాలని ఆ చిత్ర దర్శకనిర్మాతలకు సవాల్ విసురుతున్నారు కొందరు. ఈ క్రమంలో భారీగా నజరానా సైతం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో రెండో అతిపెద్ద భాగస్వామి పార్టీ ఐయూఎంఎల్ తరపున యువజన విభాగం ‘ది కేరళ స్టోరీ’పై నజరానా ప్రకటించింది. ఆ సినిమా స్టోరీ లైన్ నిజమని నిరూపిస్తే.. కోటి రూపాయలు ఇస్తామని ఐయూఎంఎల్ యూత్ విభాగం ముస్లిం యూత్ లీగ్ చీఫ్ పీకే ఫిరోజ్ ప్రకటించాడు.
👉 మరోవైపు.. నజీర్ హుస్సేన్ అనే బ్లాగర్ సైతం సినిమా కథ నిజంగా జరిగిందని నిరూపించాలని, అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే రూ.10 లక్షలు ఇస్తానంటున్నాడు. ఇక నటుడు కమ్ లాయర్ అయిన షుక్కుర్ సైతం.. మతం మార్చుకుని, ఐసిస్‌లో చేరిన మహిళల పేర్లతో కూడిన లిస్ట్ సమర్పించిన వాళ్లకు రూ.11 లక్షలు ఇస్తానని ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించాడు.
👉 మరోవైపు అధికార, ప్రతిపక్షాలు కేరళలో ఈ చిత్రాన్ని నిషేధించాలని పట్టుబడుతున్నాయి. సంఘ్ పరివార్ ఈ చిత్రం వెనుక ఉందని ఆరోపిస్తున్నాయి. ‘‘వాళ్లు(సంఘ్‌పరివార్‌ను ఉద్దేశించి..) కేరళ నుంచి 32 వేల మందిని సిరియాకు తీసుకెళ్లారని, తమ దగ్గర లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు.. ప్రతీ పంచాయితీ నుంచి 30 మందిని తీసుకెళ్లారని అంటున్నారు. కానీ, వాళ్ల అడ్రస్‌లు అడిగితే మాత్రం వాళ్ల దగ్గరి నుంచి సమాధానం లేదు.. అని పీకే ఫిరోస్ ఫేస్‌బుక్‌లో మరో పోస్ట్ చేశారు.
👉 ఒకవేళ చిత్రం గనుక ప్రదర్శించబడితే జనాలు స్వచ్ఛందంగా చిత్రాన్ని బహిష్కరించాలని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి షాజి చెరియన్ పిలుపు ఇచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ది కేరళ స్టోరీ అనేది విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందించినబడిన చిత్రమని మండిపడ్డారు. ఈ విద్వేష రాజకీయంతోనూ ఇక్కడి ఎన్నికలను సంఘ్ పరివార్ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారాయన.
👉 2018-19 నడుమ కేరళ నుంచి 32, 000 మంది హిందూ మహిళలు అదృశ్యమయ్యారని, వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేయడంతో మతం మార్చుకుని.. ఐసిస్‌లో, ఇతర ఉగ్ర సంస్థల్లో చేరారని, ఆపై భారత్‌లో.. విదేశాల్లో ఉగ్ర కుట్రలకు సాయం చేస్తున్నారన్నది ది కేరళ స్టోరీ కథాంశం. నలుగురు కాలేజీ యువతులపై ఈ కథ నడుస్తుంది. అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధీ ఇద్నాని, సోనియా బలానీ ఇందులో లీడ్ రోల్‌లో నటించారు. సుడిప్టో సేన్ డైరెక్షన్‌లో.. విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించాడు. సూర్యపాల్ సింగ్, విపుల్ అమృత్‌లాల్ షా ‘ ది కేరళ స్టోరీ’కి రచనా సహకారం అందించారు.
విపుల్ స్పందన
ఇదిలా ఉంటే.. రాజకీయపక్షాల నిరసనలను ఈ చిత్ర నిర్మాత, రచయిత విపుల్ అమృత్‌లాల్ షా స్వాగతించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని, అయితే వాస్తవాలు చేదుగా ఉన్నా సరే అంగీకరించి తీరాలని ఆయన అంటున్నాడు. కేరళకు చెందిన ఓ యువతి ఇస్లాంలోకి మారి, ఆపై సిరియాకు వెళ్లి.. చివరకు అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుతం జైల్లో ఉందని, ఆమె నుంచి, ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారంతోనే తాము కథలో ముందుకు వెళ్లామని విపుల్ వివరించారు. పైగా..
👉 ది కేరళ స్టోరీకి.. దాదాపు నెలన్నర పాటు కొనసాగిన ప్రక్రియ తర్వాత.. సెన్సార్‌బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్తున్నారాయన. రాజకీయ పార్టీలో లేదంటే ఒక నేతకు వ్యతిరేకంగా చిత్రం ఉంటే.. వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే అందులో అర్థం ఉంటుంది. కానీ, ఒక్కసారి సెన్సార్ క్లియరెన్స్ లభించాక.. దానిని ఎలా బ్యాన్ చేస్తారు?. షూట్‌అవుట్ ఎట్ లోఖాండ్‌వాలా చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంది. అలాగని ముంబై మొత్తం రౌడీలు ఉన్నట్లు అర్థమా? ఆ చిత్రం ముంబైకి వ్యతిరేకమా?.. దావూద్ కథను తీయాలంటే ముంబై నుంచే తీయాలి. ఎందుకంటే అతను అక్కడి నుంచే తన అరాచకాలను కొనసాగించాడు. అలాగని అది ముంబైకి వ్యతిరేకం అవుతుందా?.
కేరళను భూలోక స్వర్గం అంటారు. అలాంటి అందమైన ప్రాంతంలో తప్పులు జరిగాయి. వాటి వెనుక ఎవరునా.. శిక్షించబడాలనే నేను కోరుకుంటా. ఎందుకంటే కేరళను నేనూ అభిమానిస్తాను కాబట్టి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన చిత్రం కాదు.. కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిందే. ఈ చిత్రం తెరకెక్కడం వెనుక ఎవరి ప్రొద్భలం లేదు. నా సొంత ప్రాంతమైనా సరే అక్కడ జరిగే అరాచకాలను కళ్లు మూసుకుని ఉండిపోలేను. అదే తరహాలో కేరళలో జరిగిన ఈ వాస్తవాన్ని తెర మీదకు తీసుకొచ్చా అని చెప్తున్నారాయన.
ఇదీ చదవండి: మోదీ ‘అసమర్థుడైన కొడుకు’
Comments
Please login to add a commentAdd a comment