బుల్లెట్ రైలు ప్రాజెక్టు జపాన్కే
ఢిల్లీ: చైనాను వెనక్కి నెట్టి మరీ భారత్లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును జపాన్ చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టుపై చైనా భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ భారత్ జపాన్ టెక్నాలజీకే మొగ్గు చూపింది. ఈ మేరకు బుధవారం క్యాబినెట్ 98,000 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జపాన్ ప్రధాని షిజో అబే భారత పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉంది. షింజో అబే శుక్రవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు.
చైనా ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపినప్పటికీ.. డిజైన్, మేనేజ్మెంట్ లోపాలతో పాటు, గతంలో చైనాలోని వెన్జూ నగరంలో జరిగిన బుల్లెట్ రైలు ప్రమాదంలో 40 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల మూలంగా భారత్.. చైనాపై ఆసక్తి చూపించనట్లు తెలుస్తోంది. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు జపాన్ కు దక్కడంపై.. ఈ కాంట్రాక్టు చిన్న అంశమే అని పేర్కొంది. భారత్ లో పెట్టుబడులకు చైనాకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
అరవింద్ పనగాడియా నేతృత్వంలోని కమిటీ జపాన్ రైల్వే 'షీన్కన్సేన్ సిస్టమ్' అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, సమయపాలన పాటిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు మూలంగా ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది.