పోలీసులున్నా భేఖాతర్.. తగ్గని జాట్లు
ఛండీగఢ్: హర్యానాలో మరోసారి హింస చెలరేగింది. ఎనిమది రోజలుగా జరుగుతున్న జాట్ ల రిజర్వేషన్ ఉద్యమం ఆదివారం కూడా తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా భీవానీ, సోనిపేట్ జిల్లాలో రెండు పోలీస్ స్టేషన్లకు, పలు దుకాణాలకు, ఏటీంఎంలకు నిప్పు పెట్టారు. రెండు బస్సులకు, మోటార్ సైకిళ్లకు నిప్పుపెట్టారు. ఇప్పటికే ఆర్మీ బలగాలతో సహా ఈ ప్రాంతంలో మోహరించిన ఉద్యమ వేడి మాత్రం ఏమాత్రం చల్లారలేదు. దీని ప్రభావం వల్ల ఢిల్లీలో రేపు కూడా పాఠశాలలు మూతపడనున్నాయి.
హర్యానా నుంచి వచ్చే మునాక్ కాలువను అక్కడి ప్రజలు మూసివేయడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తి స్కూళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాగా, హర్యానా మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ జాట్ గుంపుతో తాము చర్చలు జరపలేమని, వారే ఓ కమిటీని వేసుకొని తమ వద్దకు వస్తే చర్చకు సులువుగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఆందోళనను అదుపుచేసి హింసకు పాల్పడేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 154మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు ఈ కేసుల్లో ఉన్నారు.