Jat stir
-
రాకపోకలు మళ్లీ షురూ...!
లాహోర్: కొన్నిరోజులుగా లాహోర్-ఢిల్లీ మధ్య ఆగిపోయిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హర్యానాలో జాట్లు నిర్వహించిన రిజర్వేషన్ల ఉద్యమంతో ఈ మార్గంలో రాకపోకల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ మార్గం మీదుగా ప్రయాణించే సంఝౌత రైలును, లాహోర్-ఢిల్లీ దోస్తీ బస్సును నిలిపివేశారు. జాట్ల నిరసనలు చల్లబడి శాంతియుత వాతావరణం నెలకొంటుండటంతో ఇరు దేశాల ప్రభుత్వాలు రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. వారంలో రెండు రోజులు(సోమ, గురువారాలు) సంఝౌత రైలు ఇండియా నుంచి బయల్దేరుతుంది. వారం కింద ఇండియా నుంచి వెళ్లిన ప్రయాణికుల వీసాల గడువును పాకిస్థాన్ ప్రభుత్వం పొడగించింది. భారత్ నుంచి పాక్ వెళ్లిన ప్రయాణికులు తిరిగి స్వదేశానికి ఎప్పుడు చేరుతామోనని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు తిరిగి రానున్నారు. -
రేప్ జరిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం
చండీగఢ్: జాట్ల ఉద్యమం సందర్భంగా హరియాణాలోని సోనిపట్ వద్ద కొందరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని వచ్చిన వార్తలను ఆర్మీ అధికారులు ఖండించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి గురువారం వరకూ ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరిగినట్టు సమాచారం లేదని చెప్పారు. కాగా చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రిజర్వేషన్లు కల్పించాలని జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న సోనిపట్ వద్ద ఆందోళనకారులు 10 మంది మహిళా ప్రయాణికులను బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. సోనిపట్ జిల్లాలో హింస చెలరేగడంతో శాంతి భద్రతల బాధ్యతను ఆర్మీకి అప్పగించారు. తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై అత్యాచార ఘటన ఎక్కడా జరగలేదని కల్నల్ బీకే పాండా చెప్పారు. -
జాట్ల ఉద్యమం; మరో 210 రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: జాట్ల ఉద్యమం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం మరో 210 రైళ్లను రద్దు చేశారు. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాదిన జాట్లు చేస్తున్న ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. హరియాణా, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, జమ్ము కశ్మీర్ మీదుగా వెళ్లాల్సిన రైళ్లపై ప్రభావం పడింది. ఇప్పటివరకు మొత్తం 1152 రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ-పానిపట్-అంబాల, ఢిల్లీ-రోహ్టక్-భటిండా రైల్వే రూట్లను మూసివేశారు. జాట్ ఉద్యమకారులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తులకు నష్టం చేకూర్చారు. 12 రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. మూడు రైలింజన్ల, ట్రాక్‌లను ధ్వంసం చేశారు. -
ఈడ్చిపారేసేందుకు కదిలిన బలగాలు
చండీగఢ్: ఉద్యమాల సమయంలో మోహరించాల్సిన బలగాలు ఉద్యమం తగ్గుముఖంపట్టాక మోహరిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం హర్యానాలో అదే జరుగుతుంది. అయితే, అదేదో ఆందోళన చర్యలు అదుపుచేసేందుకు కాదు.. ఆందోళనకారులు పోగేసిన బారీకేడ్స్, చెత్తా చెదారం తీసి పక్కకు పడేసేందుకు. అవును.. రిజర్వేషన్ల కోసం జాట్ లు చేస్తున్న ఆందోళన నేటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. హింసను సృష్టించిన ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ హామీతో కాస్తంత నెమ్మదించింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధరణ స్థితికి వస్తున్నాయి. ఈ ఉద్యమ సమయంలో వారు రహదారులు, రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లకు ఎక్కడికక్కడ అవరోధాలు సృష్టించారు. కొత్త, పాత అని తేడా లేకుండా పలు వాహనాల వాటిపై నిలిపారు. ఎక్కడికక్కడా బారీకేడ్లు పెట్టి రవాణా స్తంభించిపోయేలా చేశారు. రాళ్లు రప్పలు కూడా కుప్పలుగా పోశారు. అయితే, వాటిని తొలగించే సాహసం కేంద్ర ప్రభుత్వ బలగాలు చేయలేదు. అందులో జోక్యం చేసుకుంటే ఎక్కడ ఆందోళన మరింత హింసాత్మకం అవుతుందనే కారణంతో కనీసం వాటిపై చేయి కూడా వేయలేదు. ప్రస్తుతం వారు వెనక్కి తగ్గడంతో ఆ బారీ కేడ్స్ ను తొలగించేందుకు బలగాలన్నీ ఇప్పుడు హర్యానాలో దండిగా మోహరించాయి. గడిచిన పన్నెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఇప్పటివరకు, పదకొండు మంది ఈ ఉద్యమం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 150మంది గాయాలపాలయ్యారు. ఉద్యమ సమయంలో ఎన్‌హెచ్-10(న్యూఢిల్లీ-అంబాలా), ఎన్‌హెచ్-10(న్యూఢిల్లీ-హిసార్) రహదారులపై ఢిల్లీ అంబాలా, ఢిల్లీ-భటిండాల మధ్య నడిచే రైళ్ల ట్రాక్‌లపై ఉన్న అవరోధాలు కూడా తొలగిస్తున్నారు. ఇక సోనిపట్, పానిపట్ జిల్లాలో బారీకేడ్లను తీసివేయడంతోపాటు హర్యానా-పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ ల మధ్య తెగిపోయిన రోడ్డు మార్గాలను పునరుద్ధరిస్తున్నారు. ఈఉద్యమం కారణంగా దాదాపు 800 మంది రైళ్లను రద్దు చేసిన అధికారులు తిరిగి వాటిని ప్రారంభించే యోచనలుచేస్తున్నారు. -
పోలీసులున్నా భేఖాతర్.. తగ్గని జాట్లు
ఛండీగఢ్: హర్యానాలో మరోసారి హింస చెలరేగింది. ఎనిమది రోజలుగా జరుగుతున్న జాట్ ల రిజర్వేషన్ ఉద్యమం ఆదివారం కూడా తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా భీవానీ, సోనిపేట్ జిల్లాలో రెండు పోలీస్ స్టేషన్లకు, పలు దుకాణాలకు, ఏటీంఎంలకు నిప్పు పెట్టారు. రెండు బస్సులకు, మోటార్ సైకిళ్లకు నిప్పుపెట్టారు. ఇప్పటికే ఆర్మీ బలగాలతో సహా ఈ ప్రాంతంలో మోహరించిన ఉద్యమ వేడి మాత్రం ఏమాత్రం చల్లారలేదు. దీని ప్రభావం వల్ల ఢిల్లీలో రేపు కూడా పాఠశాలలు మూతపడనున్నాయి. హర్యానా నుంచి వచ్చే మునాక్ కాలువను అక్కడి ప్రజలు మూసివేయడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తి స్కూళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాగా, హర్యానా మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ జాట్ గుంపుతో తాము చర్చలు జరపలేమని, వారే ఓ కమిటీని వేసుకొని తమ వద్దకు వస్తే చర్చకు సులువుగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఆందోళనను అదుపుచేసి హింసకు పాల్పడేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 154మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు ఈ కేసుల్లో ఉన్నారు.